శ్రీనగర్ – జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులతో కాల్పులు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ ఘటన ఛాత్రూ ప్రాంతంలోని సింగ్‌పోరాలో జరుగుతున్న కాల్పులతో ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జవాన్ వీరమరణం పొందగా, భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టి తీవ్రంగా పోరాడుతున్నాయి. ఛాత్రూ ప్రాంతంలోని సింగ్‌పోరాలో నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నారని నిఘా వర్గాల సమాచారం అందడంతో భద్రతా బలగాలు గురువారం ఉదయం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా పాల్గొన్నాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఈ ఆపరేషన్ తీవ్ర ఎన్‌కౌంటర్‌గా మారింది.
తొలి రోజు ఇద్దరు హతం
మొదటి రోజు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. . ఇక, మిగిలిన ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లో దాక్కున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ రెండో రోజుకు చేరుకున్నప్పటికీ, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో సెపాయ్ గాయ్కర్ సందీప్ పాండురంగ్ అనే జవాన్ వీరమరణం పొందారు. సింగ్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్న స్థలాలను గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీ, డ్రోన్‌లు, థర్మల్ ఇమేజింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి.