- అధికారంలో ఉన్నవారి వైఫల్యాలే ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రాలు.
- వాటి ఆధారంగానే తదుపరి ఎన్నికల ఫలితాలు.
ప్రజా సమస్యలు, ప్రభుత్వ స్పందన, ప్రజల తరపున ఎలుగెత్తి చట్టసభల్లోనూ, బయటా గళం వినిపించడంలో ప్రతిపక్ష పార్టీలు (Opposition parties) సక్సెస్ అయితే తర్వాత టర్మ్ వారిదే. అదే సమయంలో, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాల్లో ఏవేవి మిగిలిపోయాయి? ఎందుకు చేయలేకపోయాం? అనేది స్పష్టతనిస్తూ, మళ్ళీ అధికారంలోకొస్తే వాటితోబాటు మరిన్ని మంచి పనులు చేస్తామని భరోసా ఇవ్వగలిగితే కచ్చితంగా అధికారం (authority) చేజిక్కించుకోవచ్చు.
కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? ఉభయ తెలుగు రాష్ట్రాల (Telugu states) విషయమే తీసుకుంటే, అధికార పార్టీల విమర్శలను తిప్పికొట్టలేకపోవడం, అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోవడం, తాము చేసిన అధికార దుర్వినియోగానికి బాధ్యత వహించకపోవడం…ఇలాంటి ధోరణులు కనిపిస్తున్నాయి.
పైగా తమను ఓడించడం ప్రజల తెలివితక్కువతనమన్నట్టు వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజలకు ఆగ్రహం (angery) కలిగిస్తున్నాయి ప్రతిపక్షపార్టీలు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం సంగతి తర్వాత, కచ్చితంగా ఎత్తిచూపలేకపోతున్నాయి. మళ్ళీ అవే వ్యక్తిగత దూషణల తో హోరెత్తిస్తున్నాయి. తిరిగి రాబోయేది మా ప్రభుత్వమే అని ఏ ధైర్యంతో గట్టిగా హూంకరిస్తున్నారో వారికే తెలియాలి.
మేం అధికారంలోకి వస్తే ఇప్పటి ప్రభుత్వ పార్టీ వారి అంతుచూస్తాం, బొక్కలో తోస్తాం అంటూ ధైర్యంగా అంటున్నారు. ఇది కచ్చితంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీస్కెళుతుంది.
ఎందుకంటే తిరిగి అధికారమిస్తే ఏమేం తప్పులు సరిదిద్దుకుంటామో, ఏమేం మంచిపనులు చేస్తామో చెప్పకుండా, అధికారుల మీదా ప్రస్తుత అధికార పార్టీ నేతల మీద ప్రతీకారం తీర్చుకుంటామని బహిరంగంగా వ్యాఖ్యలు (Public comments) చేస్తుంటే? ప్రజలు ఏమనుకోవాలి? మీ ప్రతీకారం కోసం అధికారాన్ని మళ్ళీ దుర్వినియోగం చేస్తారని స్పష్టంగా అనుకోరా? ఆ స్పృహతో ప్రతిపక్షపార్టీలు తమ ధోరణిని మార్చుకుని జవాబుదారీ (Accountable) గా ప్రవర్తిస్తే అధికార మార్పిడికి అవకాశముంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి బలమైన స్వరాలైతే వినిపించడం-కనిపించడం లేదన్నది ప్రజల భావన.