కూటమితో పెట్టుబడులు సాధ్యం..

కూటమితో పెట్టుబడులు సాధ్యం..
పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు
వైసిపి హయాంలో పరిశ్రమలను వెళ్లగొట్టారు
రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి టీజీ భరత్
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరోః ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు ప్రవాహంలో ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన భారత రాష్ట్రాల గణాంకాల సంకలన గ్రంథం”పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల వ్యాఖ్యలను ఖండించారు. నివేదికను పూర్తిగా అధ్యయనం చేయకుండా తమకు అనుకూలంగా వ్యాఖ్యానించారని, కానీ వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని తెలిపారు. 450 పేజీల నివేదికను సమగ్రంగా పరిశీలించిన తర్వాత కీలక అంశాలు బయటపడ్డాయని పేర్కొన్నారు.
2019-20లో ఆంధ్రప్రదేశ్‌లో 16,924 పరిశ్రమలు ఉండగా, 2023-24 నాటికి అవి 16,011కు తగ్గాయని, అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో 913 పరిశ్రమలు తగ్గాయని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం పరిశ్రమల వృద్ధి స్పష్టంగా నమోదైందని తెలిపారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పరిశ్రమల సంఖ్య పెరిగినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో క్షీణత చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. 2019–24 కాలాన్ని విజయవంతంగా చెప్పుకోవడం స్వయంగా వైఫల్యాన్ని అంగీకరించడమేనని విమర్శించారు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ప్రత్యేక మంత్రివర్గ ఉపసమితిని ఏర్పాటు చేసి, పెట్టుబడిదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని పేర్కొన్నారు. ఫార్బస్ గణాంకాల ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ. ఒక కోటి పైబడిన పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ 25.3 శాతం వాటాతో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు.
ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయని చెప్పారు. ప్రముఖ ప్రాజెక్టుల్లో అరసులోరమిట్టల్ ఉక్కు ప్రాజెక్టుకు వచ్చే నెలలో పునాది వేడుక నిర్వహించనున్నట్లు, భారత్ పెట్రోలేం చమురు శుద్ధి ప్రాజెక్టు ఇప్పటికే ఖరారైందని తెలిపారు. అలాగే పిసిబిఎల్ సంస్థ తిరిగి రాష్ట్రానికి వస్తోందని, తెలంగాణ నుంచి ప్రీమియర్ ఇంజనీరింగ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు మారిందని వెల్లడించారు.
ఈ అభివృద్ధి అంతా ప్రభుత్వ విధానాల ఫలితమని, యువతలో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని అన్నారు. ఆర్‌బీఐ నివేదిక ప్రతులను సమర్పిస్తున్నామని, గణాంకాలే వాస్తవాలను స్పష్టంగా తెలియజేస్తున్నాయని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు.
