AP | టీడీఆర్ బాండ్ల అక్ర‌మాల‌పై విచార‌ణ‌… మంత్రి నారాయ‌ణ

వెల‌గ‌పూడి – ఆంధ్ర‌ప్ర‌భ : విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ జరుగుతోందని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ శాసనసభలో ఇవాళ‌ జ‌రిగిన ప్రశ్నోత్తరాల కార్య‌క్ర‌మంలో టీడీఆర్ బాండ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ, గ‌త ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని, ఒక్క విశాఖ‌లోనే కాదు త‌ణుకు, తిరుప‌తిలో కూడా అక్రమాలు చేశారని చెప్పారు.

త‌ణుకులో రూ.63.24 కోట్ల విలువ ఉన్న చోట రూ.754 కోట్లకు బాండ్లు జారీ చేశారని తెలిపారు. రూర‌ల్ ఏరియాలో భూమి తీసుకుని పట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారన్నారు. తిరుప‌తిలో రూ.170.99 కోట్లకు 29బాండ్లు జారీ చేశారన్నారు. గ‌త ప్రభుత్వంలో అక్రమాలు జ‌ర‌గ‌డంతో తాము వ‌చ్చిన త‌ర్వాత ఐదు నెల‌లు బాండ్లు జారీ నిలిపివేశామన్నారు.

రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులపై….
అలాగే రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కింద చేపట్టిన ప్రాజెక్టులపై నారాయణ సమాధానమిస్తూ, 2007లో ఎంఐజీ ఇళ్లు అభివృద్ధి చేసేలా రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ తీసుకొచ్చామన్నారు. అనంతపురం, కర్నూలులో ప్రాజెక్ట్ పూర్తి అయిందని, మిగిలిన చోట్ల పెండింగ్‌లో ఉందన్నారు. మొత్తం 571.69 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోందని తెలిపారు. ధరల విషయంలో మంత్రి వర్గ ఉపసంఘం పలు ప్రతిపాదనలు ఇచ్చిందన్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న ఇళ్లను రద్దు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు అమల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు.

Leave a Reply