Mulugu | అంతరాష్ట్ర రాకపోకలకు అంతరాయం

163 జాతీయ రహదారిని ముంచేత్తిన గోదావరి వరద నీరు


వాజేడు, జూలై 11 (ఆంధ్రప్రభ) : ఇటీవల ఎగువ రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా గోదావరి అత్యధికంగా చేరడంతో ఉధృతంగా పెరుగుతూ ఉగ్రరూపం దాల్చింది. ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద మూడు గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 15 మీటర్లకు చేరుకుంది దీనితో తెలంగాణ- ఛత్తీస్ ఘడ్ (Telangana- Chhattisgarh) సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం (Tekulagudem) గ్రామం వద్ద 163 జాతీయ రహదారిపైకి గోదావరి వరద నీరు చేరడంతో అంతరాష్ట్ర రాకపోకలకు అంతరాయం కలిగింది. రహదారిపై నుండి మూడు అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తూ ఉండడంతో అటువైపుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. కొంతమంది మాత్రం సాహసించి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే పోలీసు అధికారులు అటువైపుగా ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు క్షణక్షణం హెచ్చరిస్తున్నారు. సమ్మక్క- సారలమ్మ బ్యారేజ్ (Sammakka-Saralamma Barrage) 59 గేట్లు ఎత్తివేయడం అదేవిధంగా కడియం ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేయడంతో వరద ఉధృతి మరింతగా పెరిగింది. దీంతో గోదారమ్మ ఉర్రూతలు ఊగుతూ పరవళ్ళు తొక్కుతుంది.

గోదావరి గంట గంటకు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఎవరూ గోదావరిలోకి చేపల వేటకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాజేడు పరిధిలోని బొమ్మనపల్లి ఏడుజర్లపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెనను గోదావరి వరద ముంచెత్తడంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా వాజేడు గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య ఉన్న కొంగాల వాగు సమీపాన రోడ్డు పైకి వరద నీరు చేరడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గోదావరి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు.

Leave a Reply