న్యూ ఢిల్లీ – భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు అంతర్జాతీయ మీడియాలో విస్తృత కవరేజీ లభించింది. అనేక ప్రఖ్యాత వార్తా సంస్థలు ఈ ఘటనను ప్రముఖంగా ప్రచురించాయి, భారత్ చర్య వెనుక ఉన్న కారణాలను, దాని పర్యవసానాలను విశ్లేషించాయి. అన్ని మీడియాలు భారత్ చర్యలను సమర్ధించాయి.. ఉగ్రదాడుల నుంచి తనను తాను రక్షించే హక్కు భారత్ ఉందంటూ నొక్కి చెప్పాయి..
న్యూయార్క్ టైమ్స్:
అమెరికాకు చెందిన ఈ ప్రముఖ పత్రిక “కశ్మీర్ దాడి తర్వాత పాకిస్థాన్ లోపల భారత్ క్షిపణి దాడులుష అనే శీర్షికతో ఒక సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ఈ చర్యను భారత్-పాక్ సంబంధాలలో ఒక ‘పెద్ద పరిణామంస గా అభివర్ణించింది. దాడులకు ముందే భారత్ అమెరికాకు సమాచారం అందించిందని, తద్వారా విస్తృత అంతర్జాతీయ ఘర్షణను తగ్గించే ప్రయత్నం చేసిందని పత్రిక తన విశ్లేషణలో పేర్కొంది.
సీఎన్ఎన్:
అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్, ‘భారత్, పాకిస్థాన్ విస్తృత సంఘర్షణ అంచున’ అంటూ ఉద్రిక్త పరిస్థితిని వివరించింది. రఫేల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణుల వంటి అత్యాధునిక ఆయుధాలను భారత్ ఈ ఆపరేషన్‌లో ఉపయోగించి ఉండవచ్చని తన కథనంలో ఊహాగానాలు చేసింది. అయితే, ఈ దాడులు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపైనే జరిగాయని, పాకిస్థానీ సైనిక ఆస్తులపై కాదని, తద్వారా భారత అధికారిక వైఖరిని పరోక్షంగా బలపరిచింది.
వాషింగ్టన్ పోస్ట్:
‘ మరో అమెరికన్ దినపత్రిక అయిన వాషింగ్టన్ పోస్ట్, ‘భారత్ పాకిస్థాన్‌పై దాడులతో ఉద్రిక్తతలు పెరిగాయి, ఇస్లామాబాద్ ప్రతిస్పందనకు సిద్ధంస అనే శీర్షికతో వార్తను అందించింది. భారత చర్యను ‘పరిమిత బల ప్రదర్శనస గా అభివర్ణించింది. సైనిక లక్ష్యాలను నివారించడంలో, పౌర ప్రాణనష్టాన్ని పరిమితం చేయడంలో భారత్ సంయమనం పాటించిందని నొక్కి చెప్పింది.
బీబీసీ:
బహవల్పూర్, మురిద్కే వంటి ప్రాంతాల్లోని ఉగ్రవాద కేంద్రాలు భారత దాడులకు కీలక లక్ష్యాలని తన కథనంలో ప్రస్తావించింది. ఈ దాడుల అనంతరం భవిష్యత్తులో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసిందని కూడా తెలిపింది.
ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్:
ఈ ఇజ్రాయెల్ వార్తా సంస్థ భారత చర్యకు స్పష్టమైన మద్దతు ప్రకటించింది. ‘ఉగ్రవాదంపై తనను తాను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉంది అని పేర్కొంటూ ఒక కథనాన్ని ప్రచురించింది.
వీటితో పాటు, ది వాల్ స్ట్రీట్ జర్నల్, షికాగో ట్రిబ్యూన్, ది గార్డియన్, ఫైనాన్షియల్ టైమ్స్, ది టైమ్స్ , ఏబీసీ న్యూస్, ఫ్రాన్స్‌కు చెందిన ‘లే మోండే’, జపాన్ టైమ్స్, జపాన్ టుడే వంటి ఇతర ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ ఘటనపై విస్తృతమైన కథనాలను, విశ్లేషణలను ప్రచురించాయి. చాలావరకు అంతర్జాతీయ ప్రచురణలు, ఇది దురాక్రమణ చర్య కాదని, ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న ఒక కచ్చితమైన, ఆత్మరక్షణ చర్య అని అభిప్రాయపడ్డాయి.