KTR | ఇంటరాక్షన్ విత్ మీడియా

KTR | ఇంటరాక్షన్ విత్ మీడియా
- రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అడుగు..
KTR | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పద్ధతి పాతదే అయినా, ప్రస్తుత సమాజానికి ఈ ఆలోచన, ఆచరణ అత్యవసరమనే భావన మరోసారి చర్చకు దారితీసింది. గెలుపును ఆస్వాదించి సంబరాలు చేసుకోవడం ఎవరికైనా సహజం. అయితే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడే రేపటి విజయానికి బాటలు పడతాయి.
ఎందుకు ఓటమి పాలయ్యాం? ఎక్కడ తప్పటడుగు వేశాం? ఎవరికి దూరమయ్యాం? ఎవరిని దూరం చేసుకున్నాం? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతకడం నాయకుడి బాధ్యత. గెలుపు మాత్రమే కాదు, ఓటమికీ తనదే బాధ్యత అని చెప్పగలగడం నిజమైన నాయకత్వ లక్షణం.

ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మరోసారి ఆచరణలో చూపించారు. ‘ఇంటరాక్షన్ విత్ మీడియా’ కార్యక్రమంలో క్యాతనపల్లి వేదికగా ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు.
ఆలోచన, ఆచరణ, అధికారం మధ్య ఉన్న అంతరాలను తగ్గించేలా గతం, వర్తమానం, భవిష్యత్తును అనుసంధానిస్తూ కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. షార్ట్‌కట్‌ల ద్వారా వచ్చిన గెలుపు, అధికారం శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండకపోతే పాలకులు కనుమరుగవుతారని ఆయన స్పష్టంగా చెప్పారు.
25 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో కేసీఆర్ వారసుడిగా, తెలంగాణ ఉద్యమ నేతగా, ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనుభవించిన అనేక సంఘటనలను రెండు గంటల చర్చలో వివరించారు. ఉద్యమం నుంచి ప్రభుత్వ పాలన వరకు, అక్కడి నుంచి ప్రతిపక్ష రాజకీయాల దశ వరకు తన ప్రయాణాన్ని సమగ్రంగా వివరించారు.
నిందలు, అపనిందలు, అపోహలు—ఇవన్నీ మధ్యలో మీడియా పాత్రపై కూడా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. పాలకులు మీడియాను పట్టించుకోని పరిస్థితులు, మీడియా ప్రజలకు చేసే సేవలపై కూడా ఆయన మాట్లాడారు.

జైలుకెళ్లితేనే సీఎం అవుతారనే భావనను ఆయన ఖండించారు. అది కేవలం అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా పార్టీలు నిలుస్తాయని, కార్యకర్తలే పార్టీలకు ప్రాణమని స్పష్టం చేశారు.
పార్టీలో కార్యకర్తలు, నాయకత్వం మధ్య బంధం మరింత బలపడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆత్మగా కొనసాగిన తమ పార్టీ ప్రజలతో అనుబంధం ఎక్కడో దూరమైందనే విషయాన్ని అంగీకరించి, దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని తెలిపారు.
ఈ ‘ఇంటరాక్షన్ విత్ కేటీఆర్’ కార్యక్రమం ద్వారా ఒక విషయం స్పష్టమైంది—తెలంగాణ ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలో, ఇంకా ఏం చేయాల్సి ఉందో కేటీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉంది.
మళ్లీ మార్పు కోరుకుంటున్న తెలంగాణ సమాజానికి, పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఆయన ఒక దిశానిర్దేశం లాంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లి, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తే విజయం సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రోజు తీసుకునే మార్పులే రేపటి భవిష్యత్తుకు పునాది అవుతాయి.
