TG | పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి : హరీశ్‌ రావు

  • రుణమాఫీ కాలేదు.. రైతుబంధు పడలేదు
  • ఒక సిద్దిపేట జిల్లాలోనే పదివేల ఎకరాల పంట నష్టం
  • రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి


నంగునూర్ : పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నంగునూరు మండల పరిధిలోని రాజగోపాల్ పేట్ గ్రామంలో వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్న పంటలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… ఒక రైతు రాగుల బాలయ్య వారి సతీమణి బాలమ్మలకు మూడెకరాల పొలం ఉందని, అందుకు రుణమాఫీ కోసం రెండు లక్షల పైనున్న రుణాన్ని అప్పు తెచ్చారని ఇంకా రుణమాఫీ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేసి తన ముందు వారి గోడును వినిపించినట్లు హరీష్ రావు తెలిపారు. దీంతో పాటు రుణమాఫీ కాలేదు రైతుబంధు పడలేదనే బాధలో ఉన్నారన్నారు. అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంటల బీమా తెస్తాం, రైతు బంధు రూ.15000 ఇస్తాం, రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. వానకాలం రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారు. యాసంగి సగం మందికి వేశామన్నారు. ఆ సగం మందికి కూడా పూర్తిగా రైతుబంధు రాలేదన్నారు.

ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ రైతుబంధు డబ్బులు పడ్డాయి. ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నెంబర్లలో అద్దెకరం, పావు ఎకరం ఎక్కువ ఉందనే సాకుతో రైతులకు రైతుబంధు ఇవ్వలేదన్నారు.9,000 కోట్ల రూపాయలు రైతుబంధు ఇవ్వాల్సి ఉంటే నాలుగు వేల కోట్లు మాత్రమే ఇచ్చాం అంటున్నారు. ఇంకా 5000 కోట్లు రైతుబంధు కోత పెట్టారన్నారు. వానకాలం 9000 కోట్లు ఈ యాసంగీ 5వేల కోట్లు మొత్తం రూ.14వేల కోట్లు ప్రభుత్వం రైతులకు ఎగనామం పెట్టిందన్నారు. రూ.14 వేల కోట్లు రైతుబంధు ఎగ్గొట్టి వాటిని రుణమాఫీలో ఇచ్చినట్టు చూపిస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు కేసీఆర్ ఆపలేదన్నారు. పంట బీమాకు సంబంధించి బడ్జెట్లో డబ్బులు పెట్టి ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదన్నారు. వంట నష్టపరిహారం ఎకరానికి రూ.6,000 ఉంటే కేసీఆర్ పదివేలకు పెంచారని గుర్తు చేశారు. పోయిన ఎండాకాలం సిద్దిపేట జిల్లాలో 1,350 ఎకరాల్లో వడగళ్ల వానకు పంట నష్టం జరిగింది, 1350 ఎకరాలకు పంట నష్టం ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని వారి తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టం చేసిన రైతులకు వడగళ్ల వాన నోటికాడి బుక్క కొట్టినట్టు అయిందన్నారు. నంగునూర్ మండలంలో 11 గ్రామాల్లో దాదాపు 5,300 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు గుర్తించామన్నారు. ఒక సిద్దిపేట జిల్లాలోనే 10,000 వేల ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా అన్నారు.

2500ఎకరాల హార్టికల్చర్ పంటలు కూడా నష్టపోయాయి…
ఇన్పుట్ సబ్సిడీతో పాటు యాసంగి రైతుబంధు కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు బీమా విషయంలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, చాలామంది చనిపోయిన రైతులకు రైతు బీమా అందడం లేదన్నారు. వెంటనే చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఉండగా అనేక విత్తనాలు సబ్సిడీ కింద ఇచ్చేవారని, కందులు, పెసర్లు, వరి లాంటి విత్తనాలను సబ్సిడీ కింద ఆనాటి ప్రభుత్వం అందించిందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ కింద విత్తనాలను అందుబాటులో పెట్టి రైతులకు సకాలంలో అందించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు వచ్చే వానాకాలానికి విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతుల గురించి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, కౌలు రైతుకు రైతుబంధు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇటు రైతు బంధు రాక ఇన్పుట్ సబ్సిడీ రాక కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వడగండ్ల వానకు పంట నష్టపోయిన కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చిన్నకోడూరు మండలంలో ఇంకా 7,352 మందికి రుణమాఫీ జరగలేదు.. హరీష్ రావు
చిన్న కోడూరు, ఆంధ్రప్రభ, ఏప్రిల్ 12 : సిద్దిపేట్ చిన్నకోడూరు మండలంలో రుణమాఫీ జరిగిన రైతులు 5,300 మంది ఉంటే ఇంకా 7,352 మందికి రుణమాఫీ జరగలేదు.రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నాను ఏ ఊర్లో పూర్తి రుణమాఫీ జరిగిందో చెప్పండి.రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చెల్లిస్తామని బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపించింది.ప్రభుత్వం నిజంగా పంటల బీమా చేసి ఉంటే రైతులకు మేలు జరిగేది.రైతులందరినీ ఆదుకోవాలని, వచ్చే వాన కాలంలో విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, 25 వేల ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.చెట్ల నరికే రేవంత్ రెడ్డి చెట్లు పెట్టే రామయ్యకు సంతాపం చెప్పడం అంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుంది.ఈరోజు అధికారులు వాళ్ళ ఉద్యోగాలు పోయి జైల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.రేవంత్ రెడ్డి తప్పుడు పనుల వల్ల అధికారులు బలయ్యే పరిస్థితి ఏర్పడింది.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి, రాముని పట్ల, ఇబ్రహీం నగర్ గ్రామాల్లో వడగండ్ల వానతో పంటనష్టం జరిగిన పొలాలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈసందర్భంగా మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ … సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వానకు తీవ్ర పంటనష్టం జరిగిందని రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపించిందన్నారు. ప్రభుత్వం నిజంగా పంటల బీమా చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదన్నారు. పంటల బీమా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. చిన్నకోడూరు మండల్ ఇబ్రహీం నగర్ గ్రామంలో ఏ రైతును అడిగినా రుణమాఫీ కాలేదనే చెప్తున్నారన్నారు. 40శాతం మందికి రుణమాఫీ జరిగితే 60% మందికి జరగలేదన్నారు. రైతుబంధు విషయంలో కూడా సగం మంది రైతులకు అందలేదు. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నారు.


తాను మొన్న అసెంబ్లీలో అడిగాను భట్టి విక్రమార్క గారు సిద్దిపేటలో ఏ ఊరికి వెళ్దామో రండి లేదా మధిర నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటారో చెప్పండి వస్తానని.. అందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని అన్నాను. నరసయ్య అనే రైతు రైతుబంధు పడలేదు, రుణమాఫీ కాలేదు పైగా వడగండ్ల వానకు పంట నష్టపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం 3,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తంగా 12 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందన్నారు. చిన్నకోడూరు మండలంలో రుణమాఫీ జరిగిన రైతులు 5,300 మంది ఉంటే ఇంకా 7,352 మందికి రుణమాఫీ జరగలేదు. గన్ మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా ఏ ఊరికి వెళ్దాము రండి రుణమాఫీ ఎక్కడ జరిగిందో చూద్దాం. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నాను ఏ ఊర్లో పూర్తి రుణమాఫీ జరిగిందో చెప్పాలన్నారు. వడగండ్ల వానకు నష్టపోయిన పంటల్లో రకరకాల పంటలు ఉన్నాయి. వరితోపాటు మిర్చి, టమాటా, కూరగాయల పంటలు చాలా ఉన్నాయన్నారు.

రైతులందరినీ ఆదుకోవాలని, వచ్చే వాన కాలంలో విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, 25వేల ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీపక్షాన తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నానన్నారు. వారు వారి భార్య అడవుల పెంపకం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావులన్నారు. ప్రతిక్షణం ఒక్కొక్క చెట్టును కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశారన్నారు. వారి మరణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. చెట్లు నరకడం రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెట్టడం రామయ్య గారి వంతు అన్నారు. చెట్లు నరికే రేవంత్ రెడ్డి చెట్లు పెట్టే రామయ్యకు సంతాపం చెప్పడం అంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుందన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీలో చాలా ఎకరాల్లో చెట్లని నరికేశాడన్నారు. హెచ్ సీయూలో 400ఎకరాల్లో చెట్లను నరికాడన్నారు. ఈరోజు అధికారులు వాళ్ళ ఉద్యోగాలు పోయి జైల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు పనుల వల్ల అధికారులు బలయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. చెట్ల పెంపకం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం వారి జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన మహనీయులు వనజీవి రామయ్యకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *