ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి

ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి
దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో అవసరం
ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యత
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : దేశాభివృద్ధికి పరిశ్రమలు ఎంతో అవసరమని రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, భీమా శాఖ మంత్రి వాసంసెట్టి శుభాష్ తెలిపారు. నాగార్జున అగ్రికం కెమికల్ లిమిటెడ్ (ఎన్ఎసిఎల్)లో 55వ జాతీయ భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి గురువారం మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో నిర్వహిస్తున్న 55వ జాతీయ భద్రతా దినోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం న ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ సంస్థలోని యాజమాన్యం, ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది భద్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల చూపుతున్న నిబద్ధతకు అభినందనలు తెలిపారు. జాతీయ భద్రతా దినోత్సవం ఒక సాధారణ వేడుక మాత్రమే కాదని, ఇది మనందరికీ భద్రతపై అవగాహన పెంచే ఒక జాతీయ ఉద్యమన్నారు. దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో అవసరమన్నారు . అయితే, ఆ అభివృద్ధి భద్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణతో కలిసి ఉండాలన్నారు. ప్రతి కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్తని, వారి భద్రతను కాపాడటం కేవలం చట్టబద్దమైన బాధ్యత మాత్రమే కాదు, ఒక నైతిక బాధ్యత కూడా ఉంటుందన్నారు.

ప్రతి ఉద్యోగిని భద్రతలో భాగస్వామ్యం చేయాలని, వారికి అవగాహన కల్పించాలని (ఎడ్యుకేట్ ), నియమాలను కచ్చితంగా తెలియచేయాలన్నారు. ఎన్ఏసిఎల్ ప్రోసెస్, భద్రత, మేనేజ్ మెంట్ సిస్టం అమలు చేస్తూ, హాజప్ స్టడీస్, రిస్క్ అసెస్మెంట్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ఛేంజ్ విధానాలను పాటిస్తున్నట్లు తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇంటర్లాక్స్, గ్యాస్ డిటెక్టర్లు, ఎమర్జెన్సీ షట్ డౌన్ సిస్టమ్స్ వంటి ఇంజనీరింగ్ నియంత్రణలను సమర్థంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. రెగ్యులర్ ఆడిట్లు, మాక్ డ్రిల్, లీడర్షిప్ ఆధారిత సేఫ్టీ ఇనీషియేటివ్స్ ద్వారా ప్రమాదాలను ముందుగానే నివారించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీరో లిక్విడ్ డిస్చార్జ్ వంటి విధానాలను అమలు చేయడం అభినందనీయమన్నారు. ఉద్యోగులకు శిక్షణ, ఎమర్జెన్సీ సిద్ధపాటు, వ్యక్తిగత రక్షణ పరికరాలు వినియోగం పై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రసంశనీయమన్నారు. ఇలాంటి సమగ్ర భద్రతా విధానాలు ప్రమాదాలను తగ్గించడమే కాకుండా సంస్థ పనితీరును మెరుగుపరుస్తాయని తెలిపారు . ఈ సంస్థకు సీఐఇ నుండి భద్రతా నాయకత్వం బహుమతి (Safety లీడర్షిప్ అవార్డు), ఐసీసీ నుండి పర్యావరణ పరిరక్షణ బహుమతి)(ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అవార్డు ) లభించడం గర్వకారణమన్నారు. ఇతర పరిశ్రమలు కూడా ఇలాంటి ఉత్తమ పద్ధతులను అనుసరించాన్నారు.
ప్రభుత్వం, పరిశ్రమలు, కార్మికులు కలిసి పనిచేసి సున్నా హాని లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. భద్రత కేవలం పరిశ్రమలకే పరిమితం కాదు జీవితంలో కూడా పాటించాలని చెప్పారు. ఈ సందర్భంగా అన్ని సంస్థలు భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని, శిక్షణలో పెట్టుబడులు పెట్టాలని, భద్రతను ఒక విలువగా మార్చాలని కోరారు. అందరం కలిసి ఒక సురక్షితమైన, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. రానున్న మూడు సంవత్సరాలలో మూడు లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామన్నారు.
స్థానిక శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ కంపెనీలో ఉద్యోగం చేసే వారు భద్రంగా తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటారని, వారిని బాగా చూసుకోవాలన్నారు. ప్రమాదాలు జరగక ముందే కాపాడుకోవాలని చెప్పారు. నిబంధనల ప్రకారం భద్రత ఏర్పాట్లు ఉండేటట్లు చూసుకోవాలన్నారు. భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు . స్థానికంగా పొల్యూషన్ అనుభవిస్తున్నట్లు వివరించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
సిఎస్ఆర్ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని,. నియోజక వర్గంలో ఉన్న సంస్థలో పని వారి చేస్తున్న పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. భద్రతతో పాటు ఉద్యోగం భద్రత కల్పించాలన్నారు. అంతకు ముందు కంపెనీ యాజమాన్యంతో సమావేశమై మంత్రి సమక్షంలోనే ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించడం లేదని స్థానిక శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు మంత్రి దృష్టికి తీసుకురాగా స్థానిక యువతకు ఇక్కడే అంప్రెంట్సిప్ ఇచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. తాగునీరు, తదితర సమస్యల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె. సాయి ప్రత్యూష, ఎన్ఎసిఎల్ ప్లాంట్ యూనిట్ హెడ్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
