జగన్ అబద్ధాలకు అడ్డూ అదుపు లేదు…

జగన్ అబద్ధాలకు అడ్డూ అదుపు లేదు…

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ

పటమట, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ఏ మంచి చేసినా మాజీ ముఖ్యమంత్రి జగన్ మొదట “వేస్ట్” అంటూ దాన్ని నేనే అడ్డుకుంటా అంటాడని, కానీ అదే ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చి, ప్రజల్లో కూటమికి మంచి పేరు వస్తుందని తెలిసిన వెంటనే ఆ ప్రాజెక్ట్ తెచ్చిందే నేనే”అంటూ ఊసరవెల్లిలా రంగు మారుస్తాడని, జగన్ అబద్దాలకు అంతే లేదని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విమర్శించారు.

అనకాపల్లి జిల్లాలో అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని గద్దె అనురాధ నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భారీ పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరగడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో గొప్ప ముందడుగని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కుమారస్వామి పాల్గొనడం రాష్ట్రానికి ఉన్న ప్రాముఖ్యతను చాటిందన్నారు. ఇది కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలిచే ఉపాధి యంత్రంగా మారబోతుందని గద్దె అనురాధ స్పష్టం చేశారు. ప్రపంచం కుబేరుడైన లక్ష్మీ శ్రీనివాస్ మిట్టల్ లాంటి వారు రూ.1,35,964 కోట్ల రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టారు అంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబుకున్న నిబద్దత, దార్శినికతకు నిదర్శనం అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఒప్పందాలు చేసుకోవడం, దానికి కావలిసిన అన్ని అనుమతులు త్వరితగతిన తీసుకోవడం, శంకుస్థాపనలు చేయడంలో నారా లోకేష్ పట్టుదలకు నిదర్శనమన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని, ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేసే శక్తి ఈ ప్లాంట్‌కు ఉందన్నారు. మొత్తం 5,465 ఎకరాల్లో రెండు దశల్లో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతమివ్వడంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు తీసుకువస్తుందని చెప్పారు. జగన్ నాయకత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేసిందని విమర్శించారు.

“విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే నినాదం ప్రజల హృదయాల్లో నాటుకుపోయిండిదని, అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి నాశనం చేయబోయారన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తామని నారా లోకేష్ చెప్పినప్పుడు, అది అసంభవమని, ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు శంకుస్థాపన జరిగిన తర్వాత ప్రాజెక్టు తీసుకురావడంలో జగన్ తన క్రెడిట్ గా చెప్పుకోవడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

ఈ ప్రాజెక్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం హర్షం వ్యక్తం చేయడం రాష్ట్రానికి ఉన్న ప్రాముఖ్యతను మరింతగా వెల్లడిస్తోందన్నారు. మొత్తంగా, కూటమి ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షిస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంటే, జగన్ బ్యాచ్ పరిశ్రమలకు భూములు ఇవ్వవద్దు అంటూ కోర్టులకు వెళ్లడం, కోర్టులలో కూడా మొట్టికాయలు తినడం అలవాటుగా మారిందన్నారు.

Leave a Reply