Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాల సందడి…

Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాల సందడి…

  • అమ్మ సన్నిధిలో భోగి మంటలు, బొమ్మల కొలువు, సంప్రదాయ కళారూపాలు..
  • ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం అధికారులు..

Indrakeeladri | విజయవాడ, ఇంద్రకీలాద్రి : తెలుగువారి అతిపెద్ద పండుగ మకర సంక్రాంతిని పురస్కరించుకుని, ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై ఉన్న శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన వైదిక కమిటీ ప్రకటించింది. పుష్యమాసంలో, పంటల పండుగ శుభసందర్భంగా తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంక్రాంతి వేడుకల్లో భాగంగా జనవరి 14, బుధవారం తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు ఇంద్రకీలాద్రిపై గల శ్రీ మహాగణపతి స్వామి వారి దేవాలయం వద్ద శాస్త్రోక్తంగా భోగి మంటలు వెలిగించనున్నారు. అలాగే, తెలుగు గృహాల సాంప్రదాయానికి ప్రతీక అయిన బొమ్మల కొలువు(doll shop) కార్యక్రమాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించనున్నారు.

Indrakeeladri |

రాజగోపురం ఎదురుగా ఉన్న మహామండపంలోని 7వ అంతస్తులో, జనవరి 14 నుండి 16 వరకు భక్తులకు దర్శనార్థం బొమ్మల కొలువు ఏర్పాటు చేయనున్నారు. అమ్మవారి వివిధ రూపాలను ప్రతిబింబించే బొమ్మలతో ఈ కొలువు భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా రూపొందించనున్నారు. మూడు రోజుల పాటు దేవస్థాన ప్రాంగణంలో గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల సంకీర్తనలు, ఇతర జానపద, వైదిక కళారూపాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ప్రకృతి, పశుసంపదకు కృతజ్ఞతలు తెలుపుతూ, సంప్రదాయ వైభవాన్ని చాటేలా ఈ కార్యక్రమాలు సాగనున్నట్లు అందుకు అనుగుణంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఈ శుభసందర్భంగా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని, శ్రీ కనకదుర్గమ్మ వారి కృపాకటాక్షాలను పొందాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply