Indrakeeladri | మహా కుంభాభిషేకానికి పటిష్ట ఏర్పాట్లు..

Indrakeeladri | మహా కుంభాభిషేకానికి పటిష్ట ఏర్పాట్లు..
భక్తులకు కట్టు దిట్టమైన భద్రత..
కలెక్టర్ లక్ష్మి శ
మహా కుంభాభిషేకం ఏర్పాట్లు క్షేత్రస్థాయి పరిశీలన..
Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరగనున్న మహా కుంభాభిషేకం – 2026 ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన కలెక్టర్, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ జె. చంద్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీ గున్నం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలయ క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, ఘాట్ రోడ్డు, యాగశాల ప్రాంతాలను కలెక్టర్ బృందం సందర్శించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్యం, తాగునీరు, అన్నప్రసాదం పంపిణీలో ఎక్కడా లోటు రాకూడదని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ డీసీపీ రామకృష్ణ తో కలిసి భద్రతా అంశాలపై కలెక్టర్ చర్చించారు.

సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తోపులాటలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల వివరణ : ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఈఓ శీన నాయక్ మహా కుంభాభిషేకం కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. విమాన గోపుర పనులు, రంగులు పనులు పూర్తయ్యాయని వారు పేర్కొన్నారు.

సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, దర్శనం వేగంగా జరిగేలా చూడాలని, ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులందరికీ అమ్మవారి దర్శనం అత్యంత ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టిందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
