TELANGANA |ఘ‌నంగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ

“కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం”

TELANGANA |తెలంగాణ రాష్ట్రంలో మహిళల గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక సామాజిక బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రారంభమైన ఈ పథకం లక్ష్యం… “కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం”, మహిళలను ఆత్మనిర్భరులుగా మార్చడం అని పలువురు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.

కమ్మర్‌పల్లి మండలంలో ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మండల అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో చీరల పంపిణీ జరిగింది. మండలంలోని గ్రామీణ ప్రాంతాల 8,400 మంది మహిళలకు చీరలు అందజేయగా, ఇంకా పంపిణీ చేయాల్సినవి 1,499 ఉన్నట్లు ఐకెపి ఏపీఎం గొపు కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతి 18 ఏళ్లు నిండిన మహిళకు చీర అందేలా చర్యలు చేపట్టామని, మహిళా సంఘాల్లో లేని వారికి కూడా పంపిణీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

చౌటుప్పల్: “మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం” – ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ పట్టణంలో చీరలను పంపిణీ చేసి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ భారీ అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి చీరలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఉన్నతికి ప్రాధాన్యత ఇస్తోందని, బెల్ట్ షాపులు మూసివేయించడం ద్వారా పేదల బతుకుల్లో మార్పు తీసుకొచ్చామని తెలిపారు. మహిళలకు భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు.

నెన్నెల: మహిళల శక్తివికాసం లక్ష్యమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టు మల్లేష్

నెన్నెల మండలంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గట్టు మల్లేష్ మాట్లాడుతూ, మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ మహిళా శక్తి పథకం అమలవుతోందని తెలిపారు. గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ఈ పథకం తోడ్పడుతోందన్నారు. ఎంపీడీవో అహ్మద్, ఎంపీవో శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

తాడ్వాయి: “మహిళా సంఘాల ద్వారా ఆర్థిక బలోపేతం” – ఏఎంసీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి

తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామంలో చీరల పంపిణీకి నాయకత్వం వహించిన ఏఎంసీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి మాట్లాడుతూ, కోటిమంది మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం అని, మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి ఆదాయవృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యమైన చీరలను అందించడం మహిళల ఆత్మబిమానానికి ప్రతీక అని చెప్పారు.

సంగారెడ్డి: “అన్నిరంగాల్లో మహిళా స్వావలంబన ప్రభుత్వ లక్ష్యం” – నిర్మలాజగ్గారెడ్డి

సంగారెడ్డి కలెక్టరేట్‌లో వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజానర్సింహ, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కలిసి చీరల పంపిణీ చేశారు.

నిర్మలాజగ్గారెడ్డి మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుందని, మహిళలే అన్ని సంక్షేమ పథకాల ప్రధాన లబ్ధిదారులని, ఉచిత బస్సు ప్రయాణం, మహిళా పరిశ్రమలకు ఉత్సాహకర పథకాలన్నీ మహిళా సాధికారతకే నిదర్శనాలని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు రాజకీయంగా ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు, సామాజిక సమానత్వానికి దారి తీస్తుందని ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.

Leave a Reply