కజకిస్తాన్‌లోని షిమ్కెంట్ వేదికగా జరిగిన 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్–2025లో భారత బృందం అదరగొట్టింది. ఎన్నడూ లేని విధంగా 50 స్వర్ణ పతకాలు, 26 రజతాలు, 23 కాంస్యాలు కైవసం చేసుకొని మొత్తం 99 పతకాలతో చరిత్ర సృష్టించింది.
ఈ అద్భుత విజయంతో భారత్ టోర్నమెంట్లో అగ్రస్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక ఆతిథ్య కజకిస్తాన్ రెండవ స్థానంలో, చైనా మూడవ స్థానంలో నిలిచాయి. ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి సీనియర్, జూనియర్ విభాగాల్లో కలిపి 129 మంది షూటర్లు పోటీపడ్డారు.
అంకుర్ మిట్టల్ అద్భుత రికార్డు..
టోర్నమెంట్ చివరి రోజున భారత షూటర్ అంకుర్ మిట్టల్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. పురుషుల డబుల్ ట్రాప్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. నాలుగు రౌండ్లలో మొత్తం 107 హిట్స్ నమోదు చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.
కజకిస్తాన్‌కు చెందిన ఆర్టియోమ్ చికులాయేవ్ (98) రజతం, కువైట్‌కు చెందిన అహ్మద్ అలపాసి (96) కాంస్యం గెలిచారు. అంతేకాకుండా, డబుల్ ట్రాప్ టీమ్ ఈవెంట్లో అంకుర్ మిట్టల్‌తో పాటు భాను ప్రతాప్ సింగ్, హర్షవర్ధన్ కవియా కలిసి కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకున్నారు.
పిస్టల్ విభాగంలో పసిడి…
25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు మెరిసారు. రాజ్కన్వర్సింగ్ సంధు వ్యక్తిగత విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకొని భారత్‌కు మరో గర్వకారణమయ్యాడు. టీమ్ ఈవెంట్లో సంధు, గురుప్రీత్, అంకుర్ గోయెల్ త్రయం అద్భుతంగా ప్రదర్శించి 1733 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించారు.
మహిళా షూటర్ల సత్తా..
భారత మహిళా షూటర్లు కూడా వెనుకంజ వేయలేదు. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రొన్ విభాగంలో మనిని కౌశిక్ కాంస్యాన్ని గెలుచుకుంది. అదే విభాగంలో అనుష్క సింగ్ భాటి స్వర్ణం సాధించగా, రాజ్కువర్ ప్రణిర్ ఇంగ్లే రజతం, యెషాయ హఫీజ్ కాంస్యాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఫలితాలతో మహిళల విభాగంలోనూ భారత్ తన ప్రతిభను సత్తా చాటుకుంది.

భారత షూటర్ల చరిత్రాత్మక విజయం..
రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ విభాగాల్లో జరిగిన 15 ఒలింపిక్ ఈవెంట్లలో భారత సీనియర్ జట్టు 6 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో అద్భుత ఫలితాలు సాధించింది. మొత్తం 50 స్వర్ణాలతో 99 పతకాలు గెలుచుకోవడం ఆసియా ఛాంపియన్షిప్ చరిత్రలో అరుదైన ఘనత. ఈ విజయంతో భారత్ క్రీడారంగంలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంది.