india vs pak | విధ్వంసానికి రెడీ

india vs pak | విధ్వంసానికి రెడీ
- శివరాత్రి రోజు కాళరాత్రి ఎవరికో..?
- రేపు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్
- కొలంబో వేదికగా మ్యాచ్ ప్రారంభం
- రాత్రి 7గంటలకు ఆరంభం

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఫిబ్రవరి 15 రోజుకు ఓ విశిష్టత ఉంది. ఆదివారం నాడు రెండు పండగలు ఒకే రోజు వచ్చాయి. ఒకటి శివరాత్రి పర్వదినం కాగా, మరొకటి క్రికెట్ పండగ. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసాలు ఉండి శివుడికి శ్రద్ధతో పూజలు చేస్తే… క్రికెట్ ప్రేమికులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌ను తిలకించి పరవశించి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదివారం కొలంబో వేదికగా ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. గతంలో కూడా శివరాత్రి రోజున భారత్, పాక్ మధ్య వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో శివతాండవం చేశాడు. పూనకాలు వచ్చినట్లు షోయబ్ అక్తర్ లాంటి బౌలర్‌ను ఉతికి ఆరేశాడు. ఆ మ్యాచ్ విశేషాలు ఏమిటో తెలుసుకోవడానికి ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం మీకోసం..

2003 మార్చి1న మహాశివరాత్రి. ఆ రోజు సెంచూరియన్ మైదానం వేదికగా జరిగిన వరల్డ్‌కప్ వన్డే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ ఢీకొన్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 273 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను చూసి కెప్టెన్ గంగూలీ ఆందోళన చెందాడు. కానీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాత్రం చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతంగా ఓ బౌల్ నిండా ఐస్‌క్రీమ్ తీసుకొని తినడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తనను ఎవరూ పలకరించవద్దని, అంపైర్లు మైదానంలోకి వెళుతుంటే చెప్పమని తోటి ఆటగాళ్లకు చెప్పాడు. ఆ తర్వాత సచిన్ క్రీజులోకి ఎంటర్ అయ్యాడు. వచ్చిరాగానే సచిన్ శివతాండవం చేశాడు. మ్యాచ్ మొదలైన రెండో ఓవర్‌లోనే సచిన్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వకార్, వసీం, అక్తర్, రజాక్‌తో తమ దేశ క్రికెట్ చరిత్రలోనే భీకర పేస్ దళం ఉన్న పాక్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా అక్తర్ కోసం సచిన్ క్రీజులో కాచుకున్నట్లు కనిపించాడు. అతడి తొలి ఓవర్‌లోనే థర్డ్‌మ్యాన్ మీదుగా భారీ సిక్స్.. ఆ తర్వాత రెండు ఫోర్లతో మ్యాచ్ టోన్‌ను సెట్ చేశాడు. ఆ తర్వాత 2003లో టీ20ని తలపించేలా మ్యాచ్ సాగింది. భారత్ 32 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. సచిన్ తన అర్ధశతకాన్ని 37 బంతుల్లో పూర్తి చేసుకొన్నాడు. సచిన్ బాదుడు దెబ్బకు తాను బౌలింగ్ చేయలేనని ఓ దశలో షోయబ్ చేతులెత్తేశాడు. సచిన్ 75 బంతుల్లో 98 బాది.. అక్తర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అప్పటికే భారత్ చేతిలోకి మ్యాచ్ వచ్చేసింది.

అయితే ఆ నాటి శివరాత్రి మళ్లీ రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2003 తర్వాత ఇప్పుడు 2026లో టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాక్ శివరాత్రి రోజు తలపడపోతున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లో భారత్ తరఫున ఎవరు శివతాండవం చేస్తారా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత జట్టులో కూడా ఇషాన్, అభిషేక్, సూర్య, తిలక్, పాండ్య, దూబే, సంజూ లాంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నారు. ఇందులో ఏ ఒక్కరు శివ తాండవం చేసినా పాక్ చిత్తు కావడం ఖాయమని భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి రేపటి మ్యాచ్‌లో ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో వేచి చూద్దాం..

