2nd semi final| ఇంగ్లండ్‌తో భార‌త్ అమీతుమీ

2nd semi final| ఇంగ్లండ్‌తో భార‌త్ అమీతుమీ

నేడు రెండో సెమీస్‌లో ఢీ
ముంబైలోని వాంఖడే మైదానంలో మ్యాచ్‌
రాత్రి 7గంట‌ల‌కు ప్రారంభం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీ20 ప్రపంచ కప్‌లో ఇవాళ బిగ్ ఫైట్ జ‌ర‌గ‌నుంది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టేందుకు టీమిండియా సిద్ధ‌మైంది. గురువారం పటిష్ట ఇంగ్లండ్‌తో నేడు అమీతుమీ తేల్చుకోనుంది. సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఇరుజట్లూ హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఇరు జ‌ట్లు ప్రారంభ మ్యాచుల్లో అంతగా రాణించ‌లేదు. త‌ర్వాత పుంజుకొని వ‌రుస విజ‌యాల‌తో సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ మెగా టోర్నీలో సెమీస్‌లో వరుసగా మూడోసారి త‌ల‌ప‌డ‌బోతున్నాయి. గత రెండు పర్యాయాల్లో చెరో గెలుపుతో సమంగా ఉన్నాయి. ఈసారి గెలిచేదెవ‌రో.. ఫైన‌ల్ చేరేదెవ‌రో మ‌రి కొన్ని గంట‌ల్లో తేల‌నుంది.

ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా నేటి(గురువారం) రాత్రి జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. టీమిండియాకు అచ్చొచ్చిన వాంఖడే మైదానంలో సెమీస్ మ్యాచ్ జరగనుండటం కలిసొచ్చే అంశం. సంజూ శాంసన్ ఫామ్‌ అందుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశం. అతనికి తోడుగా అభిషేక్ శర్మ కూడా చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. యువ ఓపెనర్‌ అభిషేక్‌శర్మ బ్యాటు ఝులిపించాల్సిన సమయం ఆసన్నమైంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ మినహా అభిషేక్‌ నుంచి ఆశించిన ప్రదర్శన లేకపోవడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. ఆరంభంలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత ప్రభావం చూపలేకపోయాడు. పరుగుల వేటలో వెనుకబడ్డాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఈ ముగ్గురిలో ఇద్దరు చెలరేగినా టీమిండియా భారీ స్కోర్ చేయడం ఖాయం.

బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా.. అర్ష్‌దీప్ సింగ్ పరుగులు కట్టడి చేయడంపై ఫోకస్ పెట్టాలి. టీమిండియా ఫీల్డింగ్ కూడా చాలా మెరుగవ్వాలి. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఏ చిన్న తప్పిదం చేసినా మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తోంది. తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం లేదు. గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది.

మరోవైపు మెగాటోర్నీలో ఇంగ్లండ్‌ ఒడిదుడుకుల పయనంగా సాగుతున్నది. నేపాల్‌ చేతిలో చావుతప్పి కన్నులొట్టబోయిన ఇంగ్లండ్‌..ఆ తర్వాత కుదురుకున్నది. పసికూన ఇటలీ ఒక రకంగా భయపెట్టినా విజయం వైపు నిలిచింది. సూపర్‌-8లో శ్రీలంక, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌పై అద్భుత విజయాలు సాదించిన బ్రూక్‌ గ్యాంగ్‌ అదే జోరులో టీమ్‌ఇండియాకు బ్రేక్‌లు వేయాలని చూస్తున్నది. బ్రూక్‌ ఫామ్‌లోకి రాగా, విల్‌ జాక్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకమవుతున్నాడు. బట్లర్‌ పేలవఫామ్‌లో ఉండగా, సాల్ట్‌ రాణించాల్సి ఉంది. మిడిల్‌ ఓవర్లలో డాసన్‌, ఆదిల్‌ రషీద్‌ స్పిన్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలే.

జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌ శర్మ, శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌, శివం దూబే, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా, వరుణ్‌.

ఇంగ్లండ్‌: ఫిల్‌ సాల్ట్‌, బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), బ్రూక్‌ (కెప్టెన్‌), బాకబ్‌ బెథల్‌, టామ్‌ బాంటన్‌, కర్రాన్‌, విల్‌ జాక్స్‌, ఓవర్టన్‌, లియామ్‌ డాసన్‌, ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌.

Leave a Reply