- 240% వృద్ధి సాధించిన మేక్ ఇన్ ఇండియా
న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రేడ్‌లో భారతదేశం మరో మైలురాయిని దాటి చరిత్ర సృష్టించింది. 2025 రెండో త్రైమాసికంలో భారత్, అమెరికాకు అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి చేసిన దేశంగా చైనాను మించినట్లు గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ Canalys తాజా నివేదిక వెల్లడించింది.
ఆ నివేదిక ప్రకారం, భారతదేశ ఎగుమతులు 240 శాతం వృద్ధిని నమోదు చేయగా, చైనా వాటా 61% నుండి 25%కి పడిపోయింది. మరోవైపు, వియత్నాం 30% వాటాతో రెండవ స్థానంలో నిలిచింది.
ఆపిల్ ఒక గేమ్ ఛేంజర్
ఈ ఊహించని మార్పులో ఆపిల్ కీలక పాత్ర పోషించిందని కెనాలిస్ ప్రిన్సిపల్ విశ్లేషకుడు సన్యామ్ చౌరాసియా అన్నారు. “అమెరికా-చైనా వాణిజ్య అనిశ్చితి నేపథ్యంలో ఆపిల్ సహా టెక్ దిగ్గజాలు తమ సప్లై చైన్స్ ను వైవిధ్యంగా మార్చుకుంటున్నాయి” అని ఆయన అన్నారు.
యాపిల్ ఇప్పటికే అమెరికాలో విక్రయించే iPhoneలలో 25% ఉత్పత్తిని భారత్‌లో చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది. ట్రంప్ విధించిన పన్నుల బెడదతో యాపిల్ చైనా నుంచి బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామ్‌సంగ్, మోటరోలా వంటి ఇతర బ్రాండ్లు కూడా కొంతమేర భారత ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి. అయితే యాపిల్‌తో పోలిస్తే వీటి అడుగులు మెల్లగానే ఉన్నాయి.