వరుసగా రెండోసారి ఇండిపెండెంట్లకే పట్టం

వరుసగా రెండోసారి ఇండిపెండెంట్లకే పట్టం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 2వ వార్డు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. పార్టీ జెండాలు, అగ్రనేతల ప్రచార హోరు కంటే అభ్యర్థి వ్యక్తిత్వానికే ఇక్కడి ఓటర్లు ప్రాధాన్యతనిస్తారని తాజా ఫలితాలు మరోసారి నిరూపించాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నిచ్చకోల వంశీకృష్ణ 521 ఓట్ల భారీ మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి అరుణ్ కుమార్‌పై ఘనవిజయం సాధించి ‘జయభేరి’ మోగించారు. ఈ వార్డులో స్వతంత్ర అభ్యర్థుల గెలుపు ఒక సంప్రదాయంగా మారుతోంది.
గత 2020 మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన షేక్ అప్సర్ ప్రజల మన్ననలు పొంది భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే బాటలో వంశీకృష్ణ విజయం సాధించడంతో 2వ వార్డులో స్వతంత్రుల జెండా రెపరెపలాడుతోంది. ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నా, ఎన్ని వ్యూహాలు పన్నినా 2వ వార్డు ఓటర్లు మాత్రం స్థానిక నాయకత్వానికే జై కొట్టారు. సేవాభావం, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలే ఇక్కడ విజయానికి ప్రామాణికంగా నిలుస్తున్నాయి. వరుసగా రెండోసారి స్వతంత్ర అభ్యర్థులే విజయం సాధించడంతో బెల్లంపల్లి రాజకీయాల్లో 2వ వార్డు ఇండిపెండెంట్ కోటగా తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకుంది.
