ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తన పట్టు మరింత బలపరచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్ల స్కోర్ సమంగా నిలివగా.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆతిథ్య జట్టును రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 192 పరుగులకే కట్టడి చేసి సిరీస్ ఆధిక్యం సాధించే దిశగా బలమైన అడుగు వేశారు. విజయానికి భారత్‌కి ఇక 193 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.
సుందర్ మ్యాజిక్ – బుమ్రా స్పెషల్ స్పెల్
భారత బౌలర్లు ఇన్నింగ్స్ అంతటా దూకుడుగా ఆడుతూనే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ బ్యాటర్లను పీడించారు. తొలి సెషన్‌లో సిరాజ్ (2/31), నితీష్ కుమార్ రెడ్డి (1/20), ఆకాష్ దీప్ (1/30) ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపారు.
ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (4/22) తన ఆఫ్ స్పిన్‌తో ఇంగ్లండ్ మిడిల్, లోయర్ ఆర్డర్‌ను పూర్తిగా అణిచివేశాడు. మరోవైపు స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా (2/38) తన అత్యుత్తమ లైన్, లెంగ్త్‌తో కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌కి గట్టి షాక్ ఇచ్చాడు.
రూట్-స్టోక్స్ ప్రయత్నం విఫలం
జో రూట్ (40) – బెన్ స్టోక్స్ (33) జోడీ 67 పరుగుల భాగస్వామ్యంతో కొంత ఊరట కలిగించినా, సుందర్ దాన్ని ఛేదించాడు. టీ బ్రేక్ తర్వాత స్టోక్స్ సుందర్ బౌలింగ్‌లో ఆగ్రహంగా షాట్లు ఆడుతూ క్లీన్ బోల్డ్ అయ్యాడు.
తర్వాతి బుమ్రా రెండు అద్భుత డెలివరీలతో కార్స్, వోక్స్‌ను వెంటనే పెవిలియన్‌కు పంపాడు. చివరగా సుందర్ బషీర్‌ను బోల్డ్ చేస్తూ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగింపు గీతకు తీసుకొచ్చాడు. ఆర్చర్ క్రీజులో నిల్చున్నా కాపాడుకోలేకపోయాడు.
ఇప్పుడు భారత్ గెలవడానికి 193 పరుగులు అవసరం కాగా… ఐదవ రోజు అంతా మిగిలి ఉంది. ఈ అవకాశాన్ని భారత బ్యాటర్లు ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 2-1 ఆధిక్యంలో నిలవనుంది.