టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తన టెస్ట్ కెరీర్‌లోనే చెత్త రికార్డు నమోదు చేశాడు. 2018లో అరంగేట్రం చేసినప్పటి నుండి 47 టెస్టులు ఆడిన బుమ్రా.. ఇప్పటిక వరకు ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా 100 కంటే ఎక్కువ పరుగులు ఇవ్వలేదు. కానీ ఆ క్షణం ఇంగ్లాండ్(England)తో మాంచెస్టర్‌లో జరిగిన నాల్గవ టెస్టులో వచ్చింది.
బుమ్రా 33 ఓవర్లు బౌలింగ్ చేసి 112 పరుగులు ఇచ్చి కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇందులో 5 మంది మాత్రమే మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. ఇంగ్లండ్ బ్యాటర్లు అతనిపై స్వేచ్ఛగా ఆడిన నేపథ్యంలో ఈ అప్రతిష్ట రికార్డును మూటగట్టుకున్నాడు.
ఇంగ్లండ్ దూకుడుతో కష్టాల్లో భారత్..
ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి అంచులపై ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు (157.1 ఓవర్లు) చేయగా, భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 311 పరుగుల భారీ లోటుతో ప్రారంభించింది. అయితే మొదటి ఓవర్ నుంచే షాక్ తగిలింది.
క్రిస్ వోక్స్ వేసిన తొలి ఓవర్‌లో యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) డకౌట్ కావడంతో టీమిండియా 0/2తో బెంబేలెత్తింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (57), కేఎల్ రాహుల్ (41) క్రీజులో ఉన్నారు.