war |ధ‌ర‌లు భ‌గ‌భ‌గ‌

war |ధ‌ర‌లు భ‌గ‌భ‌గ‌

పెరిగిన నిత్యావ‌స‌ర రేట్లు
స‌ల‌స‌ల కాగుతున్న వంట నూనె
ఇంట్లో ఉడ‌క‌ని ప‌ప్పులు
గ్యాస్ కోసం పాట్లు
బెంబేలెత్తుతున్న సామాన్యులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా నిలిచిపోయి, నిత్యావసరాలు, వంట నూనెల ధరలు భారీగా పెరిగి వంటింట్లో “యుద్ధం” మొదలైంది. వారం పది రోజులుగా పామాయిల్, ఇతర నూనెల ధరలు లీటర్‌కు గణనీయంగా పెరగగా, పప్పు దినుసుల ధరలు కూడా మండుతున్నాయి. దీంతో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి.

పశ్చిమాసియాలో జ‌రుగుతున్న యుద్ధం కార‌ణంగా విదేశాల నుంచి నూనె దిగుమతులు త‌గ్గిపోయాయి. నూనె ధరలు స‌ల‌స‌ల కాగుతున్నాయి. యుద్ధం కారణంగా భవిష్యత్తులో నూనె నిల్వలు నిలిచిపోతాయనే ప్రచారం జ‌రుగుతుండ‌టంతో వ్యాపారులు రేట్ల‌ను అమాంతం పెంచేసి అమ్ముతున్నారు. వారం రోజుల వ్య‌వ‌ధిలో లీటర్ నూనె ప్యాకెట్‌పై సగటున రూ. 20 నుండి రూ. 30 వరకు ధర పెరిగింది. విజయ బ్రాండ్‌కు చెందిన పల్లీ నూనె హోల్‌సేల్ ధర రూ. 180 ఉండగా రిటైల్ దుకాణాల్లో రూ. 185 దాటిపోయింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ హోల్‌సేల్‌గా రూ. 180 పలుకుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా రూ. 200 వరకు విక్రయిస్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే లీటరు నూనె రూ. 250 దాటుతుందనే పుకార్లు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

అలాగే పప్పు దినుసుల నౌకలు నిలిచిపోవడంతో కందిపప్పు ధర కిలో రూ.130-150 మధ్య పలుకుతోంది. గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో జనం బెంబేలెత్తుతున్నారు. గ్యాస్, నూనె ధరల పెరుగుదల వల్ల ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు పెరిగాయి. యుద్ధ ప్రభావం కేవలం నూనెలకే పరిమితం కాలేదు. గ్యాస్ కొరతతో పాటుగా రవాణా ఛార్జీలు పెరగడంతో కూరగాయల ధరలను సైతం అమాంతం పెంచేశారు. నిన్నటి వరకు రూ. 10 ఉన్న ఒక కప్పు టీ ధర.. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రూ. 20కి చేరింది.

Leave a Reply