క్యూలైనులో భక్తి భావం పెంచండి

  • ఏడు కొండలూ ఏడు రంగుల్లో గ్రీనరీ అవసరం
  • తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు


( తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి) : తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన వసతి సముదాయాన్ని (వేంకటాద్రి నిలయాన్ని) ప్రారంభించారు. పీఏసీ 5ను రూ.102 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చిన భక్తులకు వసతి కల్పించేందుకు గానూ నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనం ద్వారా ఒకేసారి 4 వేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా నిర్మించారు.

ఈ నూతన వసతి సముదాయంలో 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలూ వేడినీటి సదుపాయం తదితర సౌకర్యాలతో ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ సెంటర్ 5 ను తీర్చిదిద్దారు. అలాగే ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణ కట్టను కూడా ఈ పీఏసీ 5 ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసింది. ఒకేసారి 1400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా ఈ కాంప్లెక్సులో రెండు భారీ డైనింగ్ హాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా వసతి గృహం బుకింగ్ కౌంటర్ లో బుకింగ్ జరుగుతున్న విధానాన్ని అధికారులు వివరించారు. తొలి వసతి బుకింగ్ టోకెన్ ఓ భక్తురాలికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) అందించారు. తిరుమల పోటులో కొత్తగా తీసుకు వచ్చిన ప్రసాదం తయారీ కోసం వినియోగించే సార్టింగ్ యంత్రాలను ప్రారంభించారు. అనంతరం ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన వేస్ట్ కలెక్షన్ (వ్యర్థాల సేకరణ) యంత్రాన్ని ఇరువురు నేతలు ఆసక్తిగా పరిశీలించారు.

క్యూలైన్ల నిర్వహణకు ఐసీసీ సెంటర్

తిరుమలలో పీఏసీ – 5ను ప్రారంభించిన అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఐసిసి సెంటర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హెఆర్డీ అండ్ ఐటీ మంత్రి నారా లోకేష్, రెవిన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu), ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా అత్యుత్తమ విధానాన్ని అనుసరించాలని అధికారులకు సూచించారు. తకుముందు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం రెడీ అనలటిక్స్, మెషీన్ లెర్నింగ్ సాయంతో నిరీక్షణలో ఎంత మంది భక్తులు ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా క్యూలైన్ నిర్వహణ చేపడతామని సంబంధిత అధికారులు వివరించారు.

భక్తుల వేచి ఉండే క్యూ కాంప్లెక్సుల్లో భక్తి భావన పెంపోందించేలా ఆధ్యాత్మిక వీడియోలను, శ్రీవారి చరిత్రను ప్రదర్శించాలని సిఎం ఆదేశించారు. తిరుమల (Tirumala) కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి వద్దే నిలువరించేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించిన సీసీ కెమెరాల సాయంతో అలిపిరి నుంచే రద్దీ హీట్ మ్యాప్ లను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీవారి ఏడుకొండలు ఏడు రంగులతో గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానసిక ప్రశాంతత ఆలయాలలో మాత్రమే ఉంటుందని, ఆలయాల నిర్మాణాలకు, నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

దీంతో పాటు టీటీడీ నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో వి. వీరబ్రహ్మం, సివీఎస్వో మురళీకృష్ణ, టిటిడి బోర్డు సభ్యులు, సీఈ టివి సత్యనారాయణ పాల్గొన్నారు.

Leave a Reply