(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనలకు గురికాకుండా.. సమయస్ఫూర్తితో వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకొని తమను తాము రక్షించుకుంటూ ఇతరులకు ఆపన్నహస్తం అందించడం ముఖ్యమని, ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై ప్రజలతో పాటు అధికారులకు అవగాహన కల్పించేందుకు సమన్వయ శాఖల భాగస్వామ్యంతో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్, స్ట్రెచర్ వినియోగం, అత్యవసర వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు.
ప్రతి అధికారికీ అవగాహన ముఖ్యం:….
అగ్ని ప్రమాదాలు, భూ కంపాలు, వరదలు వంటి విపత్తుల సమయంలో ఒక అధికారిగా సామాజిక బాధ్యతతో తనను తాను కాపాడుకుంటూ ప్రజలను రక్షించడం ముఖ్యమని, ఈ నేపథ్యంలో విపత్తును చూసి భీతి చెందకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎలా ప్రజల ప్రాణాలు కాపాడొచ్చనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించి, అన్ని శాఖల అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం తదితర శాఖల అధికారులు, సిబ్బందితో పాటు ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల భాగస్వామ్యంతో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని, డివిజన్లలోనూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎఫ్‌వో) ఏవీ శంకరరావు, సహాయ డీఎఫ్‌వో కె.వినయ్, ఎస్ఎఫ్‌వో కె.నరేష్, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా.కొల్లేటి రమేష్, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ఎన్‌సీసీ కోఆర్డినేటర్ డా.డి.యుగంధర్, వివిధ శాఖల అధికారులు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.