వాజేడు, (ఆంధ్రప్రభ) : వాజేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఐపీఎస్ తెలిపారు.

ఏటూరునాగారం దిశగా గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందదంతో… వాజేడు ఎస్సై తన సిబ్బందితో మండపాక వద్ద తనిఖీలు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో… నాలుగు మోటార్‌సైకిళ్లపై ఏడుగురు వ్యక్తులు వస్తుండగా పోలీసులు వారిని ఆపారు.

ముందున్న బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, వెనక ఉన్న వారు తమ బ్యాగులను అక్కడే పడేసి మోటార్‌సైకిళ్లతో పారిపోయారు. అరెస్టైన ఇద్దరు తోగరి విష్ణువర్ధన్, జెనజర్ల రేవంత్ అని తెలిసింది. వీరిని విచారించ‌గా.. పారిపోయిన వారు మేకల మహేందర్, కొల్లి అజయ్, జంజిర్ల రోహిత్, జంజిర్ల బాలాజీ, రుత్విక్ అని పోలీసులు గుర్తించారు.

ఈ గ్యాంగ్ గోదావరిఖని ప్రాంతానికి చెందినదని, వీరంతా గంజాయి సేవించడం, ఎక్కువ ధరలకు అమ్మడం, ఆ డబ్బుతో జల్సాలు చేయడం అలవాటు చేసుకున్నారని విచారణలో బయటపడింది.

తదుపరి దర్యాప్తులో, వీరు ఆగస్టు 18న ఒడిశాకు వెళ్లి ఒక వ్యక్తి వద్ద నుంచి రూ.1.15 లక్షలకు 30 కేజీల గంజాయి కొనుగోలు చేసినట్టు తేలింది. తిరిగి వస్తున్న సమయంలో వాజేడు పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 29.829 కేజీల గంజాయి (విలువ సుమారు రూ.15 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో రిమాండ్‌కు పంపగా, మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఏఎస్పీ తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో చురుకుగా వ్యవహరించిన వాజేడు ఎస్సై, సిబ్బందిని ఆయన అభినందించారు.

Leave a Reply