IIT MADRAS | క్వాంట‌మ్‌వాలీగా అమరావ‌తి.. చంద్ర‌బాబు

  • ఇక మీరే గ్లోబల్ లీడర్లు
  • నూతన స్టార్టప్‌లే ల‌క్ష్యంగా ముందుకు
  • ఐఐటీల స్టార్టప్‌ల్లో 80 శాతం సక్సెస్
  • ఆర్థిక సంస్కరణలతో ఉప‌యోగాలు
  • అందరి చూపూ ఇండియాపైనే
  • రాబోయే రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్‌కే ప్రాధాన్యం
  • మద్రాస్ ఐఐటీలో ఏపీ సీఎం చంద్రబాబు
  • చంద్ర‌బాబు రాక‌తో కేరింత‌లు, చ‌ప్ప‌ట్లు
  • స్టూడెంట్స్ సంద‌డితో మారుమోగిన ప్రాంగ‌ణం

చెన్నై ప్రతినిధి, ఆంధ్రప్రభ : భవిష్యత్తు ఆవిష్కరణలకు యువత ఉత్సాహమే నాంది పలుకుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. నేటి యువతరమే నూతన ఆవిష్కరణల సృష్టికర్తలని ఉద్ఘాటించారు. మద్రాస్ ఐఐటీలో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… ఐఐటీలో 30శాతం మంది తెలుగు విద్యార్థులు ఉండటం గర్వకారణమన్నారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఎంత సంపాదిస్తామ‌ని సగటు విద్యార్థుల ఆలోచనలకు భిన్నంగా ఐఐటీ విద్యార్థులు ఉంటారని వెల్లడించారు. విద్యాభ్యాసం తర్వాత నూతన స్టార్టప్లతో వ్యాపారులుగా స్థిరపడాలనే ఆలోచనలు ఐఐటీ విద్యార్థులవని పేర్కొన్నారు.

సంస్క‌ర‌ణ‌ల్లో ర‌ష్యా, చైనా ఉదాహ‌ర‌ణ‌లు..
రాజకీయ సంస్కరణలు- ఆర్ధిక సంస్కరణల్లో జరిగిన విప్లవాత్మక మార్పులకు రష్యా, చైనా ఉదాహరణలని చంద్ర‌బాబు స్పష్టం చేశారు. రాజకీయ సంస్కరణల వైపు వెళ్లిన రష్యా చిన్న చిన్న దేశాలుగా విడిపోయిందని గుర్తుచేశారు. ఆర్ధిక సంస్కరణల వైపు వెళ్లిన చైనా మాత్రం ప్రపంచంలో 2వ స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా టెలికమ్యూనికేషన్స్, ఐటీని పెద్ద ఎత్తున ప్రోత్సహించామని తెలిపారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు కోసం బిల్ గేట్స్‌ని ఒప్పించిన అనుభవాలను విద్యార్థులతో చంద్ర‌బాబు పంచుకున్నారు.

బిల్‌గేట్స్‌ ను ఒప్పించాను..
బిల్‌గేట్స్‌ను మొదట తాను కలుస్తానని అడిగినప్పుడు రాజకీయ నేతలతో తనకు సంబంధం లేదని ఆయన అన్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను ఒప్పించి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నానని, 45నిమిషాలు మాట్లాడానని అన్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థను నెలకొల్పాలని కోరినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు అదే మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఉన్నారని అన్నారు.

ఇండియా వైపే ప్రపంచం దృష్టి..
ఇప్పుడు ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోందని, ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే అని చంద్రబాబు అన్నారు. ఐఐటీ మద్రాస్‌ అనేక విషయాల్లో దేశంలో నెంబర్ వన్‌గా ఉందన్న ఆయ‌న‌.. ఆన్‌లైన్‌ కోర్సులు కూడా అందిస్తోందని తెలిపారు. ఐఐటీ మద్రాస్‌ స్టార్టప్‌ అగ్నికుల్ మంచి విజయాలు అందుకుందని పేర్కొన్నారు. ఇక్కడి స్టార్టప్‌లు 80 శాతం విజయవంతం అవుతున్నాయని, ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప అడుగు అని అభిప్రాయపడ్డారు.

ఇక అమరావతి క్యాంటమ్‌ వ్యాలీ..
భారత్‌కు ఉన్న గొప్ప వరం జనాభా అని చంద్రబాబు అన్నారు. చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్య ఎదుర్కొంటున్నాయని, భారత్‌కు మరో 40 ఏళ్ల వరకూ జనాభా సమస్య లేదని పేర్కొన్నారు. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం అమెరికన్‌ ఇండియన్లదే అని తెలిపారు. అమెరికాలోని ఖరీదైన ప్రాంతాల్లోకి వెళ్లి తెలుగు, తమిళంలో పిలిస్తే చాలామంది పోగవుతారన్నారు. భారతీయులు ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా సర్దుకుపోగలుగుతారని, 2047 నాటికి భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ వన్‌ అవుతారని అభిప్రాయపడ్డారు. భారతీయులు సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకుంటారని, రానున్న రోజుల్లో అమరావతిని క్యాంటమ్‌ వ్యాలీగా నిలబెడతామని స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన యువశక్తి మన సొంతమన్నారు.

సమష్టి కృషితో.. సాధ్యం …
అంతా కలిసికట్టుగా పని చేస్తే 2047నాటికి దేశాన్ని నెంబర్1 స్థానంలో నిలబెట్టగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. భారతదేశం నెంబర్1 స్థానంలో ఉంటే అందులో తెలుగువారే ఎక్కువ ఉంటారన్నారు. నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ నిరంతర ప్రక్రియ కావాలని చెప్పారు. నేటి యువత గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. నేర్చుకోవటానికి రిటైర్మెంట్ అంటూ ఉండకూడదని స్పష్టం చేశారు. దేశంలో డిజిటల్ కరెన్సీకి మోదీ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహించిందని, డిజిటల్ కరెన్సీ వినియోగంపై తాను కేంద్రానికి ఇచ్చిన నివేదిక సత్ఫలితాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 6 లక్షల మంది ఇంటి నుంచే పని చేస్తున్నారని, వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని రానున్న రోజుల్లో 30-40 లక్షలకు తీసుకెళ్లవచ్చని వ్యాఖ్యానించారు. 2047లో దేశాన్ని నెంబర్1 స్థానంలో నిలబెట్టడం మీ చేతుల్లోనే ఉందని విద్యార్ధులతో చెప్పారు. పరిచయ కార్యక్రమంలో విద్యార్థుల కేరింతలు, చప్పట్లతో ప్రాంగణమంతా మార్మోగింది. చెన్నైలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *