వికారాబాద్ టౌన్, జులై 15 (ఆంధ్రప్రభ): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పేదల సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేకుంటే రాజీనామా చేయాలని మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ (Chalo Hyderabad) కు సంబంధించి జిల్లా సన్నాహక సభ సందర్భంగా మంగళవారం వికారాబాద్ (Vikarabad) జిల్లా కేంద్రంలో సత్య భారతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు (MRPS Founder) మందకృష్ణ మాదిగ ఈసందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వ ఏర్పడి 20నెలలు గడిచినా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
పేదలకు ఆరోగ్యశ్రీ కానీ, వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్, నాలుగు కిలోల నుండి ఆరు కిలోల వరకు పేదలకు బియ్యం ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితమే అని పేర్కొన్నారు. నాలుగైదు సంవత్సరాల నుండి వికలాంగులకు కొత్త పింఛన్ ఇవ్వటం లేదని ఈ సందర్భంగా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వచ్చిన హామీలు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతున్నాయి.. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో నోరు మెదపడం లేదని, వారికి వచ్చే ఎలక్షన్ లో అనుకూలంగా ఉండేందుకే మౌనంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు పి ఆనంద్ మాదిగ, వీ ఎచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ళ జంగయ్య, జిల్లా అధ్యక్షుడు శ్యామ్, నాయకులు పుష్పరాని, పద్మమ్మ, సునీత, రాజు, తదితరులు ఉన్నారు.