వేమూరి కావేరీకి సర్కార్లే అండ
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : కర్నూలు సమీపంలో 20 మందిని బలి తీసుకున్న వీకావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదం వెనుక, ఇప్పుడు రిజిస్ట్రేషన్ మిస్టరీ బయటపడింది. ఈ బస్సు చట్టబద్ధతపై వెలుగు చూస్తున్న వివరాలు చూస్తే, బస్సు కాదు, ఇది పేపర్లలో పునర్జన్మలు పొందిన వాహనం అనేలా కనిపిస్తోంది. దమన్ –దీవ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ బస్సు రిజిస్ట్రేషన్, బీమా, అనుమతుల గజిబిజీగా తిరిగినట్లు అధికారులు గుర్తించారు.
అక్కడ..ఇక్కడ.. ఎక్కడైనా… ఈ బస్సే…
ఈ బస్సు నంబర్ డిడి 01 ఎన్ 9490, ఇది దమన్ –దీవ్ కేంద్ర పాలిత ప్రాంతంలో రిజిస్టర్ చేశారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో మాత్రం ఒడిశాలోని రాయగడ జిల్లా చిరునామా, ఇక బీమా మాత్రం ఒంగోలులోని న్యూ ఇండియా ఎష్యూరెన్స్ బ్రాంచ్‌లో జరిగింది. అంటే – ఒక బస్సు మూడు ప్రాంతాల చిరునామాలతో తిరుగుతూ ప్రయాణికులను మింగేసింది.
ఈ మాయాజాలం మామూలే…
ఈ బస్సును 2018 మే 2న వీ కావేరి ట్రావెల్స్ కొనుగోలు చేసింది. ఏడాది ఆగస్టు 8న తెలంగాణ మేడ్చల్ ఆర్టీఓ కార్యాలయంలో సీటర్ బస్సుగా నమోదు చేశారు. తర్వాత తెలంగాణ – ఏపీ రవాణాశాఖలు, బస్సుల అల్టరేషన్ (సీటర్‌ను స్లీపర్‌గా మార్చడం)కు అనుమతులు ఇవ్వకపోవడంతో, 2023 ఏప్రిల్ 26న దమన్ –దీవ్‌లో కొత్తగా రీ రిజిస్ట్రేషన్ చేశారు. కేవలం హోమ్ ట్యాక్స్ తక్కువగా ఉండటం కారణంగా ఈ రీజిస్ట్రేషన్ అక్కడ చేయించారని అధికారులు చెబుతున్నారు. తర్వాత ఒడిశాలోని రాయగడ ఆర్టీవో కార్యాలయంలో మరోసారి రిజిస్ట్రేషన్ ప్రయత్నం, కానీ నంబరు మాత్రం దమన్ –దీవ్ రిజిస్ర్టేషన్ కొనసాగింది.
ఓర్నీ ఒంగోలులో బీమా..
ఈ ఏడాది ఏప్రిల్ 18న ఒంగోలులో బస్సుకు బీమా చేయించగా, రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రం ఒడిశాలోని సాయిలక్ష్మీనగర్ చిరునామాతో వేమూరి వినోద్‌కుమార్ పేరుతో ఉన్నాయి. ఈ పత్రాలన్నింటిలోనూ బస్సు 43 సీట్ల సీటర్‌గా నమోదైంది. కానీ వాస్తవానికి అది స్లీపర్ బస్సుగా ప్రయాణిస్తోంది.
రవాణా శాఖ కళ్లప్పగింత..
ఈ పత్రాలన్నింటిలోనూ స్పష్టమైన వ్యత్యాసాలు ఉండగా, ఏ రాష్ట్రం రవాణా శాఖ కూడా తన పరిధిలోకి వచ్చే ఈ బస్సును పరిశీలించలేదు. కాదు.. పట్టించుకోలేదు. మామూళ్ల మత్తులో జోగాయి. ప్రతి చెక్‌పోస్టు, టోల్‌ప్లాజా వద్ద పర్మిట్లు, వాహన వివరాలు ఆటోమేటిక్‌గా చెక్ అయ్యే వ్యవస్థ ఉన్నప్పటికీ, ఈ బస్సు మాత్రం నిబంధనల చిట్టెల్లో గుచ్చుకుని, ఏ రాష్ట్రమూ పట్టుకోలేని విధంగా రోడ్డుపై దూసుకుపో యింది. వీ కావేరి ట్రావెల్స్‌కి 100 కి పైగా బస్సులు ఉన్నట్లు సమాచారం. వీటిలో పదుల సంఖ్యలో సీటర్ బస్సులను అక్రమంగా స్లీపర్‌లుగా మార్చి, దమన్ – దీవ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో రీరిజిస్ట్రేషన్ చేశారు. ఈ మార్పులకు ఏ రాష్ట్ర రవాణా శాఖ నుండి అధికారిక అనుమతులు లేవు. కానీ అనధికార గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే కేవలం ఆరోపణ కాదు. రవాణా నిపుణుల ప్రకారం ఒక రాష్ట్రంలో నిబంధనల కఠినత పెరిగినపుడు, ట్రావెల్స్ కంపెనీలు కారు చౌక పన్ను, సడలింపులు ఉన్న ప్రాంతాల్లో రీరిజిస్ట్రేషన్ చేస్తాయి. దీని వల్ల రహదారి భద్రత, బీమా చెల్లుబాటు, ప్రయాణికుల బాధ్యతలన్నీ ప్రశ్నార్థకమవుతాయి.
చేతులు కాలితే… కళ్లు తెరచిన యంత్రాంగం..
కర్నూలు దుర్ఘటన అనంతరం, ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ అధికారులు ఈ బస్సు రిజిస్ట్రేషన్, పర్మిట్ పత్రాలపై ఇంటర్‌స్టేట్ విచారణ ప్రారంభించారు. దమణ్–దీవ్, ఒడిశా, తెలంగాణ రవాణా అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే తెలంగాణ మంత్రి పొన్నాల ప్రభాకర్ సీరియస్ అయ్యారు. మూడు రాష్ట్రాల మంత్రులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని .. అనుమతులు లేక పోతే తాట తీస్తామని మీడియా సాక్షిగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి కూడా ఇదే రీతిలో స్పందించారు. కర్ణాటక ప్రభుత్వమూ స్పందించింది. ఈ మూడు రాష్ట్రాలు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాయి. కానీ.. ఈ ప్రభుత్వాల తప్పిదాలు ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇది దేశవ్యాప్తంగా ట్రావెల్స్ మాఫియా, పేపర్ రిజిస్ట్రేషన్ వ్యాపారం మరియు రవాణా శాఖల మధ్య సమన్వయ లోపం అనే పెద్ద సమస్యను బట్టబయలు చేసింది. సడలింపుల కోసం పత్రాల మాయాజాలం, బస్సు మార్పులు అనుమతి లేకుండా చేయడం, బీమా, పర్మిట్‌లు వేరే రాష్ట్రాల్లో పొందడం – ఇవన్నీ కలిసి ఒక దుర్ఘటనకు దారితీశాయి. కర్నూలు విషాదం కేవలం డ్రైవర్ తప్పిదం కాదు. ఇది సిస్టమ్ వైఫల్యం. చట్టాల మధ్య గందరగోళాన్ని ఉపయోగించుకున్న రవాణా దందాలు, పర్యవేక్షణలో లొసుగులు, మానవ ప్రాణాల పట్ల నిర్లక్ష్యం ..ఇవన్నీ కలసి మరోసారి రోడ్లపై రక్త ధార కథను తెరమీదకు తీసుకు వచ్చాయి.

