హైదరాబాద్, జులై 15 (ఆంధ్రప్రభ) : బీసీలకు 42శాతం రిజర్వేషన్ (Reservation) అమలు చేయకుంటే భూకంపం సృష్టిస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఇందిరాపార్కు (Indira Park) వద్ద ధర్నా చౌక్ లో బీసీలకు రిజర్వేషన్ అమలు కోసం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలు అంతా ఒక్కతాటి పైకి వచ్చి మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కులాల వారీగా విడదీసి రాజకీయ లబ్దిపొందే కుట్రలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అమలుకు సాధ్యం కాని మోసపూరిత వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ డ్రామాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు.
మాజీ ముఖ్యమంత్రులు NT రామారావు (NT Rama Rao), రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy), KCR లు తీర్మానం చేసి పంపినా అమలు కాలేదని వివరించారు. హడావుడిగా తప్పుల తడకగా కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టారని, BRS పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని చెప్పారు. 9వ షెడ్యూల్ లో చేర్చి పార్లమెంటులో బిల్లు చేస్తేనే చట్టబద్ధత వస్తుందని తెలిసినా మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని, బిల్లు చేసిన తర్వాత చెల్లుబాటు కాదని చట్టాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో తీర్మానాలు చేసిన కోర్టులు కొట్టివేశాయని వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల్లో నిర్వహించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఓడిపోతామనే భయంతో కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరాల్సిందేనని, లేదంటే మీకు అడ్రెస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. మేము యాచకులం కాదు… మా హక్కు మాకు కల్పించకుంటే మేము ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. బీసీ లు ఎంతో చైతన్యంతో ఉన్నారన్నారు. రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
