- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బోరబండలో తమ సభకు అనుమతి ఇచ్చి రద్దు చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బోరబండ ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. పాతబస్తీలోనే సభ పెట్టి సత్తా చూపించామని, బోరబండ తమదేనని, బరాబర్ సభ పెడతామని, కాషాయ జెండాను రెపరెపలాడిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు టోపీ పెట్టుకుని, నమాజ్ పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. తాను హిందువునని, ఇతర మతాలను గౌరవిస్తా తప్ప కించపర్చనని చెప్పారు. బండి సంజయ్‌ను ఆపడం ఎవరి తరం కాదని సవాల్ విసిరారు.
కేసీఆర్ గడీలు, ఫామ్‌హౌస్‌ను బద్దలు కొట్టింది తామేనని బండి అన్నారు. కేసీఆర్ పెద్ద మూర్ఖుడని, ఆయన కుమారుడు ఇంకా మూర్ఖుడని అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఆశతో, తండ్రిని పక్కకు తోసి సీఎం కావాలని చూస్తున్నారని, జనం కష్టాల్లో ఉన్నప్పుడు రాని కేటీఆర్ సీఎం ఎక్కడ అవుతాడని ప్రశ్నించారు.
కల్వకుంట్ల కవితనుద్దేశించి మాట్లాడుతూ ఆమె అన్న, బావ, బాబాయి కొడుకుతో జాగ్రత్తగా ఉండాలని, అప్పుడప్పుడు కేసీఆర్ దగ్గరకు వెళ్లి బాగోగులు చూసుకోవాలని బండి సూచించారు. మాగంటి గోపీనాథ్ మరణానికి కేటీఆరే కారణమని ఆమె తల్లే చెబుతున్నారని, దీనిపై రోషం, పౌరుషం ఉంటే రేవంత్ రెడ్డి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బోరబండలో కాంగ్రెస్ రెండేళ్లలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయలేదని, రోడ్డు విస్తరణకు ఇళ్లు కూల్చిన కాంగ్రెస్ ఎంఐఎం షాపులను మాత్రం కూలగొట్టడం లేదని, బీజేపీ అధికారంలోకి వస్తే బుల్డోజర్లు పెట్టి వాటిని కూల్చివేయిస్తానని హెచ్చరించారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, దేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి దోచుకున్న పార్టీలు ఈ రెండేనని బండి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి జరుగుతోందంటే అది మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధుల వల్లేనని, హైదరాబాద్ అభివృద్ధిపై లెక్కా పత్రంతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే వారు మతం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక వర్గం ఓట్ల కోసం ఒవైసీ వెంట తిరుగుతున్నారని… రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని కాంగ్రెస్ వాళ్ళని అన్నారు.
30 శాతం ఓట్ల కోసం 70 శాతం ఓట్లను పక్కనపెట్టిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లను మంత్రి కోరారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ముస్లింల ఇళ్లకు వెళ్లి మిక్సర్, గ్రైండర్, కుట్టు మిషన్లు ఇస్తూ దండం పెడుతున్నారని, హిందువులను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి 40 వేల బురఖాలను తెప్పించి, వాటితో దొంగ ఓట్లు వేయించుకుని గెలవాలని చూస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని కోరారు.
చార్మినార్‌పై కాషాయ జెండా ఎగరేసేదాకా పోరాడతామని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గెలిస్తే హిందువుల బతుకులు బర్బాద్ అవుతాయని, హిందూ రాజ్యం కావాలా? రామ రాజ్యం కావాలా? అని ఆలోచించమన్నారు. జూబ్లీహిల్స్‌లో నిన్నటి దాకా ఓకే (ఒవైసీ, కేసీఆర్) ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ఒరే (ఒవైసీ, రేవంత్) ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను బొంద పెట్టాలని, బీజేపీని గెలిపించాలని కోరారు.
సర్వేల పేరుతో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని దర్శించుకుంటానని, హిందువులంతా అక్కడికి రావాలని కోరారు. టైంపాస్ పాలిటిక్స్ వద్దని, మీ దమ్ము చూపించాలని కోరారు. ఓటుకు రూ.10వేలు, రూ.20 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రలోభాలు పెడతాయని, డబ్బులు తీసుకోండి, ఆ పార్టీల చెంప చెళ్లుమనిపించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. రేపటి నుండి రహమత్తు నగర్ కాదు, ఇకపై అది మీనాక్షి నగర్ అని ప్రకటించారు.

