కాశీబుగ్గ (వరంగల్): గత మూడు ఏండ్ల క్రితం వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం నిర్మించిన ఇళ్లను వెంటనే జర్నలిస్టులకు అందించాలని ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను వెంటనే జర్నలిస్టులకు అందివ్వాలని, జర్నలిస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు లేరా? పేదలు లేరా అని, ఇందులో ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మంత్రి కొండాసురేఖను ఆయన ప్రశ్నించారు. తన హయాంలో జర్నలిస్టుల కోసం జీవో కేటాయించి 200మందికి డబుల్ బెడ్ రూంలు నిర్మించామని.. వారికి ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అవసరమైతే జర్నలిస్టుల కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాలు, వరంగల్ తూర్పు జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.