హైదరాబాద్, ఆంధ్రప్రభ : ‘ చాలా మంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇక్కడ నాకేదో భూములు ఉన్నాయని.. అందుకే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇది నా కోసమో.. నా కుటుంబం కోసమో కాదు.. భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాను ‘ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆదివారం (సెప్టెంబర్ 28) రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ – 1 నిర్మాణాలకు శంకుస్థాన చేసిన అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆనాడు కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేశారని, నిజాం కాలంలో సికింద్రాబాద్‌ను అభివృద్ధి చేశారని, ఉమ్మడి సైబరాబాద్, సిలికాన్ వ్యాలీ అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు.
మన భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ నగరాలు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చర్చించుకునేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఉండాల్సిన అర్హతలన్నీ భారత్ ఫ్యూచర్ సిటీకి ఉన్నాయని సీఎం అన్నారు. దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని, ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీ పట్నం గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని, అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
రానున్న పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందన్నారు. ఇందుకు మీ అందరి సహకారం ఉండాలని.. చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామన్నారు.
ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని, తాను కూర్చొని మీ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడి కోర్టులకు వెళ్లి నష్టపోవద్దని, తక్షణమే మీ సమస్యలను పరిష్కరించాలని తమ అధికారులను ఆదేశిస్తున్నాని చెప్పారు. అందరికీ న్యాయం చేయాలనేదే తమ ప్రయత్నం అని అన్నారు.
డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ భవనం, స్కిల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. అప్పుడు నెలకు మూడుసార్లు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తామని, ప్రపంచంలో ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోనే కూర్చొని మాట్లాడుతానన్నారు.
సింగరేణికి పది ఎకరాలు కేటాయించాలి
ఫ్యూచర్ సిటీలో సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి పది ఎకరాలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. ప్రపంచ దేశాల్లో ఉన్నపరిశ్రమలతో సింగరేణికి అనుబంధం ఉందని, ఇక్కడ సింగరేణి ఉంటే వాటి అనుబంధ పరిశ్రమలు ఇక్కడకు వస్తాయన్నారు. అందుకనుగుణంగా సింగరేణికి పది ఎకరాల భూమి కేటాయించాలన్నారు.
పదేళ్లు అవకాశమివ్వండి…
తనకు పదేళ్లు ఉండేలా అవకాశం ఇవ్వాలని, పదేళ్లులో ప్రణాళికబద్ధంగా ఈ నగరాన్ని నిర్మిస్తానని సీఎం అన్నారు. ప్రపంచంలో ఉన్న నగరాల కోసం మనం చెప్పుకోవడం కాదని, మన తెలంగాణలో ఉన్న నగరం ప్రపంచమంతాట చెప్పుకునే విధంగా నిర్మిస్తానని చెప్పారు.
సీఎం సొంతూరులో…
తన సొంత గ్రామమైన కొండారెడ్డి పల్లికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం చేరుకున్నారు. ఆయనతోపాటు మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. రూ. 91.71 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు.
సీఎం ప్రారంభించిన అభివృద్ధి పనులు ఇవే…
- జాతీయ రహదారి నుండి కొండారెడ్డిపల్లి గ్రామం వరకు ఆర్ అండ్ బీ రోడ్డు ప్రారంభం.
- మిల్క్ చిల్లింగ్ యూనిట్ ప్రారంభం.
- జీపీ భవనంలో సోలార్ యూనిట్ ప్రారంభం.
- ఆలయ ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
– యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ప్రారంభం.
– మిషన్ భగీరథ (ఇంట్రా) ట్యాప్ ప్రారంభం. - గ్రామస్తుల ఇంట్లో సోలార్ యూనిట్ ప్రారంభం.
- పిల్లల పార్క్, ఓపెన్ జిమ్ ప్రారంభం.
- పోల్కంపల్లిలో రోడ్డు పనులకు శంకుస్థాపన.