స్వర్ణముఖి రక్షణే ధ్యేయం
ఆక్రమణల్ని సహించం
తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : గత ప్రభుత్వ హయాంలో అక్రమణలకు గురైన స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంత పరిరక్షణ కు హైడ్రా తరహాలో ప్రత్యేక అధికార వ్యవస్థ ను ఏర్పాటు చేయనున్నట్టు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వెల్లడించారు. చైర్మన్ బాధ్యతలు స్వీకరించి వంద రోజులు పూర్తి అయిన సందర్బంగా సోమవారం ఆయన తన కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం లో దివాకర్ రెడ్డి మాట్లాడుతూ 130 కిలోమీటర్ల పొడవైన పవిత్ర స్వర్ణముఖి నది తీరం వెంబడి గత వైసిపి ప్రభుత్వ హయాంలో భారీగా ఆక్రమణలు జరిగాయన్నారు. స్వర్ణముఖి నదికి ఇరువైపులా భూములు కబ్జా చేసి అమ్మేశారని, వంకలు, చెరువులను తప్పుడు పత్రాలతో దోచుకున్నారని, స్వర్ణముఖినది బఫర్ జోన్ ను పట్టించుకోకుండా కబ్జా చేశారని ఆరోపించారు. ఆ నదిని పరిరక్షించడానికి ప్రభుత్వ సహకారం తో ఎపిలో మొదటిసారి నది అభివృద్ధికి నడుంబిగించి ఆపరేషన్ స్వర్ణ అనే కార్యక్రమం చేపడ్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా నదికి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలు, కబ్జాలను తొలగించి, నది బఫర్ జోన్ లో స్థలాలు విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి హైడ్రా తరహాలో ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నామని దివాకర్ రెడ్డి వెల్లడించారు. నదిలో ఇళ్ళు కట్టడం వల్ల రెండేళ్ల క్రితం స్వర్ణముఖి నది వరదలో అపార నష్టం జరిగిందని గుర్తు చేస్తూ అదంతా గత వైసిపి ప్రభుత్వం చేసిన పాపమన్నారు. అటువంటి అక్రమ కట్టడాల బాధ్యతను సీఎం చంద్రబాబు తుడాకు అప్పగిస్తూ జిఓ జారీ చేశారని చెబుతూ తుడా, మున్సిపల్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కమిటీ వేసి ఆక్రమణలు తొలగిస్తామని, ఆక్రమణలు చేసిన ఎంతటి వారినైనా వదిలేది లేదని స్పష్టం చేసారు. అదేవిధంగా తుడాలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణా పూర్తయ్యిందని, ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. గత వంద రోజుల్లో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చామని వివరించారు.

