HYD | తెలంగాణ ప్రజలు బాగుండాలే
- జేపీ దర్గా ఎంతో పవిత్రమైన స్థలం
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కొత్తూరు, (ఆంధ్రప్రభ): జహంగీర్ పీర్ దర్గా ఎంతో పవిత్రమైన, సెంటిమెంటల్ స్థలమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా, ఆమె గురువారం కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో గల హజరత్ జహంగీర్ పీర్ దర్గాను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు రమేష్, ముస్తఫా తదితరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దట్టి, పూలచాదర్‌ను నెత్తిపై పెట్టుకుని ర్యాలీగా దర్గాకు చేరిన కవిత, బాబాలకు చాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ముజావర్ల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత మాట్లాడుతూ… కేసీఆర్ దర్గా అభివృద్ధి కోసం రూ.100 కోట్లను కేటాయించి ఎంతో కృషి చేశారని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
జేపీ దర్గా ఎంతో పవిత్రమైన స్థలం. జహంగీర్ బాబాల ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమే. తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశాం అని కవిత అన్నారు.
ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్లి పరిష్కరించేందుకు జాగృతి సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. జనం బాట పర్యటన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో కొనసాగిందని, శుక్రవారం మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.



