హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్లో (బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన మధ్యాహ్నం స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
హయత్ నగర్ మండలంలోని కుంట్లూరులో ఉన్న నారాయణ కాలేజీ సమీపంలో బుధవారం ఉదయం సుమారు 5:45 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వారిని పిన్నింటి చంద్రసేనా రెడ్డి (24), చుంచు త్రినాథ్ రెడ్డి (24), చుంచు వర్షిత్ రెడ్డి (23)గా గుర్తించారు.
ప్రమాదంలో మరణించిన యువకుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యువకుల దుర్మరణం చాలా బాధాకరమని ఆయన అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కన్నబిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని, వారికి మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి యువతకు సూచనలు చేశారు. “రెప్పపాటులో జరిగే ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. వేగంగా వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమైనది. దయచేసి ఎవరూ అతివేగంతో వాహనాలు నడపకండి. అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం తగదు. మీ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవడానికి వేగ పరిమితి పాటించండి, సురక్షితంగా డ్రైవింగ్ చేయండి” అని యువతకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.