హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మెట్రో రైల్ సంయుక్తంగా ఒక అవగాహన సదస్సును నిర్వహించాయి. మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు సాధనపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు.
ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవ్వగా.. కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘురామరెడ్డి, పోరిక బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మెట్రో రెండో దశపై ప్రజెంటేషన్
మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండో దశ ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకత, ప్రణాళికలు, దాని వల్ల నగరానికి కలిగే ప్రయోజనాలను గురించి ఆయన క్షుణ్ణంగా వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల సమీకరణలో ఎంపీల సహకారం ఆవశ్యకతను నొక్కి చెప్పారు.