HYD | చిన్నారి ప్రాణం తీసిన ఏసీ..

కాచిగూడ (హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని కాచిగూడలో శుక్రవారం ఓ ఇంట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ (AC) పేలడంతో ఐదేళ్ల చిన్నారి సజీవ దహనమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్ నగర్‌లో ఒక నివాస గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎయిర్ కండిషనర్ పేలి ఒక చిన్నారి మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోని గదిలో పిల్లలు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాదం జరిగిందిలా..

గదిలో ఏసీ నడుస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ కంప్రెసర్ పేలిపోయింది. దీంతో సెకన్ల వ్యవధిలోనే గది మొత్తం మంటలు అలుముకున్నాయి. ఏసీలోని ప్లాస్టిక్ ఇతర కెమికల్స్ కాలిపోవడంతో దట్టమైన నల్లటి పొగ గదిని కమ్మేసింది. గ‌దిలోనే ఉన్న ఐదేళ్ల చిన్నారి ఆ పొగ కారణంగా ఊపిరాడక, మంటల వేడికి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

బాలుడి పరిస్థితి విషమం..

ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయపడిన మ‌రో బాలుడిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply