HYD | అంబర్‌పేట్ ఎస్ఐ అరెస్ట్

HYD | అంబర్‌పేట్ ఎస్ఐ అరెస్ట్
HYD | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ పోలీస్ శాఖలో మరో దుర్వినియోగ కేసు వెలుగులోకి వచ్చింది. అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న భానుప్రకాశ్ రెడ్డిని పోలీసులు (Police) అరెస్టు చేశారు. బెట్టింగ్ వ్యసనానికి బానిసై, అప్పులు తీర్చేందుకు కేసుల్లో రికవరీ చేసిన సొత్తును దుర్వినియోగం చేసినట్లు, తన సర్వీస్ రివాల్వర్‌ను కూడా పోగొట్టుకున్నట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఐ (SI) భానుప్రకాశ్‌రెడ్డి కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పులు చేశారు. వాటిని తీర్చే మార్గంలేక, తాను విచారిస్తున్న కేసుల్లో భాగంగా రికవరీ చేసిన సొత్తును తాకట్టు పెట్టి, దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే క్రమంలో అత్యంత బాధ్యతాయుతంగా కాపాడుకోవాల్సిన తన సర్వీస్ రివాల్వర్‌ను కూడా భానుప్రకాశ్‌రెడ్డి పోగొట్టుకున్నారు.
దీనిపై అధికారులు ప్రశ్నించగా, తొలుత రైలులో పోయిందంటూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. అయితే, విచారణలో ఒత్తిడి పెరగడంతో చివరకు రివాల్వర్ పోగొట్టుకున్నట్లు అంగీకరించారు. ఆరోపణలు ప్రాథమికంగా రుజువు కావడంతో పోలీసులు భానుప్రకాశ్‌రెడ్డిని (BhanuPrakash Reddy) అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన్ను రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
