Hunt | న‌క్స‌లిజం అంతుచూస్తాం – 2026 నాటికి పూర్తిగా అంతం చేస్తాం : అమిత్ షా

ప్రభావిత జిల్లాలు 12 నుంచి ఆరుకు తగ్గాయి
4,5 తేదీల్లో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో అమిత్‌షా ప‌ర్య‌ట‌న‌
ఉన్న‌త‌స్థాయి భేటీ నిర్వ‌హించ‌నున్న కేంద్ర హోం మంత్రి
అనంత‌రం 7, 8 తేదీల్లో జ‌మ్ముక‌శ్మీర్‌లో ప‌ర్య‌ట‌న‌

న్యూఢిల్లీ ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ :

2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని మోదీ ప్రభుత్వం పూర్తిగా నిర్మూలిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలు 12 నుంచి ఆరుకు తగ్గినట్లు వెల్లడించారు. నక్సల్‌ రహిత భారత్‌ను నిర్మించే దిశగా మరో మైలు రాయిని చేరుకున్నామన్నారు. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో కొన్ని రోజులుగా వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జ‌రుగుతున్నాయి. ఈ కాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతపై అమిత్‌ షా తాజాగా స్పందించారు. దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కఠినమైన విధానాన్ని అవలంభిస్తుంద‌న్నారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని.. ఇందులో భాగంగా సురక్షిత భారత్‌ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు వెళ్ల‌నున్న అమిత్‌షా..

హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికల ప్రకారం.. దేశంలో నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలు 12 ఉన్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం.. 2015లో ఇవి 35ఉండగా..2018 నాటికి 30కి తగ్గాయి. 2021నాటికి 25కు వచ్చాయి. తాజాగా వాటి సంఖ్య 6కు చేరింది. మరోవైపు రాష్ట్రంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను సమీక్షించేందుకు అమిత్‌ షా ఈనెల 4, 5 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్‌ కార్యకలాపాలను సమీక్షించనున్నట్లు అధికార‌ వర్గాలు తెలిపాయి. అనంతరం షా ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో జమ్ముకశ్మీర్‌లో పర్యటించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *