జీవన సంగ్రామంలో ప్రతి వ్యక్తికి ప్రాణాంతకమైన కష్టాలు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. అవతార పురుషుడైన శ్రీ రామచంద్రుడు రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలి అరణ్యవాసానికి వెళ్ళాడు. అంతఃపురంలో హాయిగా ఉండవలసిన లక్ష్మణుడు భ్రాతృ భక్తితో అన్న వెంట పయనమయ్యాడు. పతిభక్తిని నిరూపిస్తూ సీతా సాధ్వి భర్త వెంట నీడలా నడిచింది.

ఏక పత్నివతుడైన శ్రీ రామచంద్రుడు భార్యా వియోగాన్ని భరించలేక విలవిలలాడాడు. సీతాన్వేషణలో సోదరుడు లక్ష్మణులతో కలిసి మహారణ్యాలు తిరుగుతూ కబంధుని హస్తాలలో చిక్కుకున్నారు. ఇరువురు ఎట్టకేలకు ఆ రాక్షసుని వధించారు. శాప విమోచనం కలిగిన కబంధుడు సీతాదేవి లభించు ఉపాయాన్ని శ్రీరామునికి తెలియజేశాడు. ఇక్కడ మనం గ్రహించ వలసిన విషయం శ్రీరామ చంద్రుడు అంతటి వాడే తన అర్ధాంగి జాడ తెలుసుకొనుటకు చెట్టు, పుట్ట, పక్షి ఇలా అనేకములను ప్రశ్నించి సహాయం తీసుకున్నాడు. మానవ జీవితం కూడా అటువంటిదే అందరి జీవితాలు వడ్డించిన విస్తరిలా ఉండవు.

పూర్వజన్మ సుకృతం వలన, ప్రారభ్దం వలన జన్మ కొనసాగుతూ ఉంటుంది. లోకంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను దాటుటకు అనేక ఉపాయాలున్నాయి. సంధి, నిగ్రహం, యుద్ధము, అనుకూల కాలము కోసం ఆగడం, బలహీనులు బలవంతులతో ద్వైదీ భావము కలిగి ఉండడం, ముఖ్యమైనది సమాశ్రయము.

ఈ సమాశ్రయము తగిన సమర్థులతో కలిగి ఉండాలి. దుర్దశలలో చిక్కుబడిన వారు అదే విధంగా వాటి నుండి బయటపడు సమయము ఆసన్నమగుట గుర్తించాలి. సీతాదేవిని కోల్పోయి అరణ్యములలో తిరుగుతున్న రామ లక్ష్మణులు కబంధుని సలహా తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీకు సహాయ పడగల మిత్రుని ఆశ్రయించడం ముఖ్యకర్తవ్యం. విధి విలాసములో కష్టములు ఎంతటి వారికైనా తప్పవు శోకిస్తూ కూర్చుంటే సమస్యలకు పరిష్కారం దొరకదు. ధర్మసంస్థాపన కొరకు కష్టములలో ఉన్న వారందరూ ఏకము కాక తప్పదు అప్పుడే ఈ సృష్టి పది కాలాలు మనగలుగుతుంది.

జీవరాశులన్నీ క్షేమంగా ఉంటాయి కావున పంపా సరోవర సమీపముల గల ఋష్యమూక పర్వతము పై సుగ్రీవుడను ఒక వానర ధీరుడు గలడు. ఇతని అన్న వాలి. కొన్ని అపోహల వలన సుగ్రీవుని కిష్కింద రాజ్యం నుండి వెడలకొట్టాడు. అతని భార్యను కూడా చెడగొట్టాడు. రాజ్య బ్రష్టుడై భార్యావియోగంలో సుగ్రీవుడు కుమిలిపోతున్నాడు. అతడు మహా బలశాలి. వానరుడని చులకనగా భావింపకు. అతడు కూడా ఆ దుర్భర పరిస్థితి నుండి బయట పడుటకు ఒక మహావీరుని కొరకు ఎదురు చూస్తున్నాడు.

దుర్దశలో కష్టముల నుండి బయట పడుటకు అనేక మందిని ఆశ్రయించడం తప్పు కాదు. అయితే సమర్థులను మాత్రమే ఆశ్రయించాలి. మీకు చెప్పదగ్గవాడిని కాకపోయినా నాకు శాప విమోచడం కలిగించిన మహానుభావులు కనుక కృతజ్ఞతతో ఈ సలహా ఇస్తున్నానని ముగించాడు కబంధుడు. తర్వాత హనుమ ప్రవేశం, రావణ సంహారంతో లోక కళ్యాణం మనకు తెలిసిందే. కనుక కష్ట కాలంలో సమాశ్రయం పొందడం వివేకవంతుల లక్షణం.

వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు..

Leave a Reply