Suryapet | జ్యువెలరీ షాపులో దోపిడీ.. 18కిలోల బంగారం మాయం..

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట (Suryapet) లోని సాయి సంతోషి జ్యువెల‌రీ షాపులో భారీ చోరీ చోటుచేసుకుంది. 18కిలోల బంగారం (gold), రూ.22 లక్షల నగదు (Rs.22 lakh cash) చోరీ జరిగిందని యజమాని పోలీసులకు (police) ఫిర్యాదు చేశారు. దుకాణం వెనుక నుంచి గ్యాస్ కట్టర్ తో షట్టర్ తొలగించి దొంగలు (Thieves) లోనికి ప్రవేశించినట్లు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఉదయం షాపు తెరిచిన యజమాని తెడ్ల కిషోర్ (Tedla kishor) దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ లతో ఆధారాలు సేకరిస్తున్నారు. సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ బంగారం షాపుకు చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. దోపిడీ ఘటన అంతరాష్ట్ర ముఠా పనా లేక ఇంటి దొంగలెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అర్థరాత్రి చోరీ జరిగినట్లు భావిస్తున్న పోలీసులు, సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాల కోసం వెతుకుతున్నారు. జ్యువెలరీ షోరూంలోని ఫుటేజీని, సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలను స్కాన్ చేయడమే కాకుండా, సమీపంలోని వ్యక్తులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు జ్యువెలరీ షోరూమ్ సిబ్బందిని కూడా విచారించారు.. త్వరలో మరిన్ని ఆధారాలు దొరుకుతాయని పోలీసులు పేర్కొన్నారు.

శనివారం షాపు మూసేశామని, ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయం షాపు తెరిచి చూడగా షాపు మొత్తం దుమ్ము, స్ట్రాంగ్ రూం గోడకు రంధ్రం పడి ఉందని షాప్ యజమాని కిషోర్ తెలిపారు. లోపలికి వెళ్లి చూడగా దొంగలు ఉన్నదంతా దోచుకెళ్లారని పేర్కొన్నారు. దాదాపు రూ.17కోట్ల విలువైన ఆభరణాల చోరీకి పాల్పడ్డారని కిషోర్ తెలిపారు. సీసీటీవీ సహా అన్నీ ధ్వంసమయ్యాయని చెప్పారు.

దోపిడీతో సూర్యాపేటలోని బంగారం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఇలానే దోపిడీ జరిగిందని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. బంగారం షాప్ యజమాని ఫిర్యాదు మేరకు దొంగతనం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ విషయం పట్టణంలో సంచలనంగా మారి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధాన కూడలిలో ఉన్న షాపులో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది.

One thought on “Suryapet | జ్యువెలరీ షాపులో దోపిడీ.. 18కిలోల బంగారం మాయం..

Leave a Reply