బ్రేకింగ్ న్యూస్ – అందెశ్రీ కన్నుమూత..

బ్రేకింగ్ న్యూస్ – అందెశ్రీ కన్నుమూత..

మూగబోయిన కష్టజీవి కలం

తెలంగాణ గుండెచప్పుడుగా మారుమోగిన గళం మూగవోయింది..

తెలంగాణ జీవనశైలిని ప్రతిబింబించే కలం ఆగిపోయింది..

ప్రముఖ రచయిత, తెలంగాణ గీత రచయిత అందెశ్రీ కన్నుమూసారు


వెబ్ డెస్కు, ఆంధ్రప్రభ, హైదరాబాద్, నవంబరు 10 : తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిండిపోయిన గొంతు.. “జయ జయహే తెలంగాణ.. జననీ జన్మభూమి..” అనే గీతాన్ని రచించిన ప్రముఖ కవి, గేయ రచయిత, ఉద్యమకారుడు అందెశ్రీ (64) ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఉదయం ఇంట్లో అస్వస్థతకు గురై కుప్పకూలిపడగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని గాంధీ హాస్పటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆయన మరణించారు. ఆయన అందెశ్రీ మరణంతో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక లోకం ఒక అమూల్య రత్నాన్ని కోల్పోయింది.

జీవిత విశేషాలు

1961 జులై 18న సిద్ధిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. బాల్యం నుంచి సాహిత్యం, కవిత్వం పట్ల ఆకర్షితుడైన ఆయన అశుకవిత్వంలో అపార ప్రావీణ్యం సాధించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన రోజుల్లో ఆయన పదునెక్కిన పదాలు యువతను కదిలించాయి. “జయ జయహే తెలంగాణ.. జననీ జన్మభూమి..” అనే రాష్ట్ర గీతం ఆయన రచన. ఈ గీతం లక్షలాది తెలంగాణ ప్రజల గొంతుకగా మారింది. ఉద్యమ సమయంలో ఆయన రాసిన గీతాలు, కవితలు ర్యాలీల్లో, సభల్లో, రోడ్లపై గర్జించాయి. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆయనకు గుర్తింపుగా ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారం అందజేసింది.

అందెశ్రీ కవిత్వం బడుగు-బలహీన వర్గాల కష్టాలను, తెలంగాణ జీవన విధానాన్ని, గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన కలం నుంచి జాలువారిన పదాలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. కాకతీయ యూనివర్శిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సినిమా గీత రచనలో కూడా ఆయన ముద్ర వేశారు. 2006లో విడుదలైన ‘గంగ’ సినిమాకు రాసిన పాటలకు నంది పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ పురస్కారం, దాశరథి సాహితీ పురస్కారం, 2022లో జానమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య పురస్కారం అందుకున్నారు.

కుటుంబ వివరాలు

అందెశ్రీకి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ఇంటి వద్ద బంధువులు, అభిమానులు పోటెత్తారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద వాతావరణం కన్నీటి మయమైంది.

సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

అందెశ్రీ మరణ వార్త తెలిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కవి.. మా అందెశ్రీ గారు కన్నుమూశారని తెలిసి గుండె బాధపడుతోంది. ఆయన రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ప్రతి తెలంగాణవాడి గుండెల్లో ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. ఆయనతో నాకున్న అనుబంధం ఎప్పటికీ మరచిపోలేనిది” అని సీఎం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రాజకీయ నేతలు, సాహితీ వేత్తల స్పందనలు

అందెశ్రీ మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు స్పందించారు.

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: “తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ గీతాలు మాకు ఆయుధాల్లా పనిచేశాయి. ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేము.”
  • కవి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య: “అశుకవిత్వంలో అందెశ్రీకి ఎవరూ సాటి రారు. ఆయన పదాలు తెలంగాణ గడ్డ మీద శాశ్వతంగా లిఖితమైపోయాయి.”
  • బీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్ రావు: “తెలంగాణ గీత రచయితగా అందెశ్రీ గారు మనందరి గుండెల్లో నిలిచిపోతారు.”
అంతిమ యాత్ర.. నివాళులు

అందెశ్రీ పార్థివ దేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సాయంత్రం 4 గంటల తర్వాత అంబర్‌పేట్ శ్మశానవాటికలో రాష్ట్ర అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసం వద్ద అభిమానులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు నివాళులర్పిస్తూ కన్నీటి కడలిగా మారారు.

అందెశ్రీ గుండెచప్పుడు ఆగిపోయినా..
ఆయన గీతాలు, కవితలు, పదాలు.. ఈ గడ్డ మీద ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి.

Leave a Reply