పేదలకు ఇళ్లు ప్రభుత్వ ధ్యేయం

పేదలకు ఇళ్లు ప్రభుత్వ ధ్యేయం

-అర్హులు వ‌చ్చే నెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలి
-రాష్ట్ర వ్యవ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి(శ్రీకాకుళం), అక్టోబరు 24(ఆంధ్రప్రభ): అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవ‌సాయ శాఖమంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడ క్యాంప్ కార్యాల‌యంలో  గృహ‌నిర్మాణ శాఖ అధికారుల‌తో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర‌తి పేద‌వాడికి ప‌క్కా ఇళ్లు నిర్మించాల‌న్న‌దే  కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని అందుకు అనుగుణంగా అధికారులు సమగ్ర ప్రణాళికతో ప‌నిచేయాల‌ని సూచించారు.

ప్రభుత్వం  అర్హులను గుర్తించి త్వరలో నూతన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్న నేప‌థ్యంలో ప్ర‌తి పేద‌వాడు దరఖాస్తు చేసుకునేలా చూడాల‌ని ఆదేశించారు. తొలుత ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించారు.సమస్యలను సావధానంగా విని, నాణ్యమైన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధిక సంఖ్యలో సొంత  ఇళ్లు లేద‌ని మంజూరు చేయాల‌ని ప్ర‌జ‌లు వినతులు అందజేశారు. ఇళ్లు లేని నిరుపేదలు ఆయా వార్డు, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని, గృహ నిర్మాణ కార్యాలయంలో అందజేయాల‌ని సూచించారు.

వ‌చ్చే నెల 5లోగా అర్హ‌త కలిగిన ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాల‌ని అన్నారు. పేదల ఇబ్బందులు గమనించిన కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై ప్ర‌త్యేక దృష్టి సారించింద‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో గృహ‌నిర్మాణ ప్రాజెక్టు అధికారి ర‌మాకాంత్‌, త‌దిత‌రులు పాల్లొన్నారు. అనంతరం స‌ర్దార్‌ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ 150 జ‌యంతి పుర‌స్క‌రించుకుని సర్దార్ యూనిటీ మార్చ్ ను ప్రారంభించ నున్న నేప‌థ్యంలో ఇందుకు సంబంధిచి పోస్ట‌ర్‌ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

Leave a Reply