Hospital | వీధి కుక్క స్వైర విహారం… 50 మందికి గాయాలు

Hospital | వీధి కుక్క స్వైర విహారం… 50 మందికి గాయాలు
- బాధితులకు ఆసుపత్రిలో చికిత్సలు
Hospital | బైంసా, ఆంధ్రప్రభ : బైంసా పట్టణంలో ఈ రోజు ఓ వీధి కుక్క స్వైర విహారం(Dog walk) సృష్టించింది. గంటన్నర వ్యవధిలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పరిగెత్తుతూ దాడులు చేసి సుమారు 50 మందిని గాయపరిచింది. బట్టి గల్లీలో నలుగురిపై దాడి చేసిన కుక్క అక్కడి నుంచి జుల్ఫెకార్ గల్లి, పంజేషా చౌక్ మార్కెట్ ఏరియాతోపాటు పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగించింది.
వారసంత కావడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలపై బస్టాండ్ సమీపంలోనూ దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు గాయాల పాలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గాయపడిన వారిని స్థానికులు, బంధువులు భైంసా ఏరియా హాస్పిటల్(area hospital) తరలించారు. బాధితుల్లో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
హాస్పిటల్ సిబ్బంది చికిత్సలు అందించారు. సబ్ కలెక్టర్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ అజ్మీరా సాంకేత్ కుమార్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. వీధి కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
