Home Guards | సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన హోంగార్డులు

Home Guards | బాసర నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికి వచ్చి క్యూలైన్లో వేచి ఉన్న భక్తుడు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు రక్షించాలని కోరడంతో అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డులు ఇంద్రకరణ్ రెడ్డి, గణేష్ స్పందించి భక్తుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు.
వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లాకు చెందిన భక్తుడు తిరుపతి కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి బాసరకు విచ్చేశాడు. క్యూలైన్లో మూడు గంటలకు పైగా వేచి ఉండడంతో ఒక్కసారిగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. విధుల్లో ఉన్న హోంగార్డులు ఇంద్రకరణ్ రెడ్డి గణేష్ చాకచక్యంగా భక్తుడు తిరుపతికి సి పి ఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు.
అనంతరం భక్తుడు తిరుపతిని వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించి భక్తుడు తిరుపతిని అంబులెన్స్ లో బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. భక్తుడి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సరైన సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలను నిలబెట్టిన హోంగార్డులు ఇంద్రకరణ్ రెడ్డి, గణేష్లను ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది, భక్తులు అభినందించారు.
