హాలీవుడ్ భామ బాలీవుడ్ ఎంట్రీ ?

హాలీవుడ్ స్టార్ సిడ్నీ స్వీని త్వరలోనే బాలీవుడ్‌లో మెరిసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఒక ప్రముఖ భారతీయ నిర్మాణ సంస్థ ఆమెకు 45 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.530 కోట్లు) ఆఫర్ చేసిందట. ఇందులో రూ.415 కోట్లు నటన ఫీజు, రూ.115 కోట్లు స్పాన్సర్‌షిప్ డీల్గా ఉంటుందని సమాచారం.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రస్తుతం బలంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఈ భారీ బడ్జెట్ సినిమాను అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించనున్నారని తెలుస్తోంది. సిడ్నీ ఒక అమెరికన్ స్టార్‌గా, భారతీయ సెలబ్రిటీతో ప్రేమలో పడే పాత్రలో కనిపించనుందట. న్యూయార్క్, ప్యారిస్, లండన్, దుబాయ్ వంటి నగరాల్లో షూటింగ్ జరగనున్న ఈ సినిమా 2026 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది.

ఆఫర్ చూసి సిడ్నీ ఆశ్చర్యానికి గురైనప్పటికీ, తాను ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉందని, ఈ అవకాశంపై ఆలోచిస్తున్నదని సమాచారం. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

సిడ్నీ కెరీర్..
HBO సిరీస్ Euphoria, The White Lotus ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సిడ్నీ, ప్రస్తుతం Christy అనే బయోపిక్‌లో నటిస్తోంది. ఇందులో అమెరికన్ బాక్సర్ క్రిస్టీ మార్టిన్ పాత్రలో కనిపించనుంది. అదనంగా ఆమె అమెరికన్ ఈగిల్ డెనిమ్ బ్రాండ్ అంబాసడర్‌గా కూడా వ్యవహరిస్తోంది.

సీన్ మారింది..

ఇప్పటి వరకు మన నటులే హాలీవుడ్‌లో మెరిశారు. ధనుష్ (The Gray Man), ఇర్ఫాన్ ఖాన్ (Life of Pi, Jurassic World), సురజ్ శర్మ (Life of Pi), అలాగే ప్రియాంక చోప్రా (Quantico, Baywatch) & దీపికా పదుకొనే (XXX: Return of Xander Cage) లాంటి స్టార్‌లు ఇండియన్ టాలెంట్‌ని ప్రపంచానికి చూపించారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. తొలిసారిగా ఒక హాలీవుడ్ స్టార్ భారతీయ చలనచిత్ర తెరపై డెబ్యూట్ చేసే అవకాశం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మన వాళ్లే హాలీవుడ్ వైపు వెళ్ళగా… ఇప్పుడు హాలీవుడ్ స్టార్లు బాలీవుడ్ కి వస్తున్న కొత్త ట్రెండ్ మొదలైందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కేవలం సినిమా ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ గ్లోబల్ పవర్‌కి చేరుకున్న ప్రతీకగానూ భావిస్తున్నారు. హాలీవుడ్ నుండి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న కొత్త తార సిడ్నీ స్వీనీ అవుతుందా అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

Leave a Reply