భారత్ కు ఒలింపిక్స్ పతకాలు తెచ్చిన హాకీ..
దేశంలోనే ప్రజాధారణ పొందిన క్రీడగా గుర్తింపు
సెంటినరీకాలనీలో శతాబ్ధి వేడుకల పోటీలు
పెద్దపల్లి జిల్లా రామగిరి, నవంబర్ 7 ఆంధ్రప్రభ : భారత దేశానికి ఒలింపిక్స్ లో పతకాలు తెచ్చిన క్రీడగా హాకీ (hockey) కి ప్రత్యేక గుర్తింపు ఉందని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవి రావు, ఐఎన్ టియూసీ సెంట్రల్ సెక్రటరీ ఏ.రామారావులు పేర్కొన్నారు. భారత జాతీయ హాకీ అసోసియేషన్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం శతాబ్ది వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా (Peddapally district) హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామగిరి మండలం సెంటినరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా మైదానంలో హాకీ మ్యాచ్లు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవి రావు, ఐఎన్టీయూసీ సెంట్రల్ సెక్రటరీ ఏ.రామారావులు హాజరై క్రీడలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ క్రీడ హాకీ భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ, భారతదేశానికి ఒలింపిక్స్లో తొలి బంగారు పతకాలు అందించిన క్రీడ హాకీ అన్నారు.
దానిని స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని ప్రతి గ్రామానికి హాకీ క్రీడను పరిచయం చేసిన భారత హాకీ అసోసియేషన్ గత శతాబ్ద కాలంలో అట్టడుగున ఉన్న క్రీడాకారులకు చె యూతనందించి, దేశానికి అత్యుత్తమ హాకీ ఆటగాళ్లను అందించడం గర్వకారణమన్నారు. గత 100 ఏళ్ల స్ఫూర్తిదాయక సేవలను స్మరించుకుంటూ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో పెద్దపల్లి హాకీ అసోసియేషన్ భాగస్వామ్యం కావడం సంతోషకరమన్నారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ముకేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ సలీం, సభ్యులు కెఎల్ఎన్ ప్రసాద్, సదానందం, నరసింహారెడ్డి, శేషగిరి, నాగరాజు, అరిఫ్, చంద్రపాల్, రంజిత్, రాజ్ నికిల్, అడ్డూరి రాజయ్యలు పాల్గొన్నారు.

