ఆయన సేవలు చిరస్మరణీయం
- మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : కర్నూలులోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్(In Parinaya Function Hall)లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ 109 వ జయంతి వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్(TG Venkatesh) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్నిప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ(BJP) రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy), జిల్లా నాయకులు రామకృష్ణ, రామస్వామి, విట్టా రమేష్, పురుషోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళి, మహిళా నాయకురాలు గీతా మాధురి పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చిన్న వయసులోనే దీన దయాల్ ఉపాధ్యాయ ఈ లోకాన్నివిడిచినప్పటికీ ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని చెప్పారు.
దేశ రాజకీయ నాయకుల్లో ఆయన అరుదైన వ్యక్తిత్వం కలవారని వివరించారు. అలాంటి వ్యక్తుల జీవిత చరిత్రలను తెలుసుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వివరించారు. ప్రతి ఒక్కరు దేశానికి సేవ చేసిన మహనీయుల జీవిత చరిత్రలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడే మనం కూడా సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తాను ఎంతో మంది ప్రధాన మంత్రులతో నేరుగా కలుసుకున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)తో తాను కలిసినప్పుడు ఆయన అరుదైన వ్యక్తిత్వాన్నిగమనించానని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మిగతా ప్రధాన మంత్రులకు భిన్నంగా అన్ని రంగాల్లో అవగాహన కలిగి ఉంటారని చెప్పారు. తాము ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆయనతో ముఖాముఖి(Interview) సమావేశం అయ్యానని, ఆయన ఎంతో విలువైన సలహాలు ఇస్తారని చెప్పారు .వెంకటేశ్వర స్వామినీ దర్శించుకున్నప్పుడు ఎలాంటి అనుభూతికి గురవుతామో అలాంటి అనుభూతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు పొందుతామని వివరించారు.
దేశానికి మంచి జరిగినప్పుడు ఆయన ఎంత మంచిగా ఉంటారో.. దేశానికి ఎవరైనా హాని తల పెడితే అంతే భయంకరంగా స్పందిస్తారని చెప్పారు. అన్నివర్గాల ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మమేకం అయ్యే తీరు ఆదర్శప్రాయమని వివరించారు .ఆయన నిరంతరం జ్ఞానం పెంచుకునే విధంగా ముందుకు సాగుతారని వివరించారు .ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు దేశభక్తి నీ పెంపొందించుకోవాలని, సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పారు. ఇతర మతాలవారు హిందువులను మతమార్పిడి చేస్తారని, కానీ హిందువులు(Hindus) మాత్రం అలాంటి విషయాల జోలికి వెళ్లరని వివరించారు.


