TG | నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది : డిప్యూటీ సీఎం భ‌ట్టి

నిరుద్యోగ యువత ఆశలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, యువతకు ఉద్యోగాలు కల్పించడం వల్లనే.. తెచ్చుకున్న‌ రాష్ట్రానికి అర్థం, పరమార్థం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

హైదరాబాద్ సైబర్ గార్డెన్ లో ఈరోజు (శుక్రవారం) నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెన్స్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్,  హౌస్ కీపర్స్ తో పాటు టీజీపీఎస్సీ ద్వారా ఆర్దిక శాఖలో నూతనంగా నియామకమైన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ కు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ” రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించ‌డంలో.. ముందంజలో ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిన సందేశాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను.” అని అన్నారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా (భట్టి విక్రమార్క) నేను సమిష్టిగా ఆలోచన చేసి భూములు ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మాట ఇచ్చామన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం అర్హత కలిగిన 112 మందికి యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి 35 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మా ప్రభుత్వం కల్పించిందన్నారు.

రూ.9 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలు..

రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆశించి పోరాడిన యువతకు ఉద్యోగాలు కల్పించడం వల్లనే… క‌ష్ట‌ప‌డి తెచ్చుకున్న రాష్ట్రానికి అర్థం, పరమార్థం ఉంటుందన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 59 వేల మంది నిరుద్యోగుల‌కు ఉద్యోగ నియామక పత్రాలు అందించామ‌న్నారు.

ఉద్యోగ అవకాశాలు పొందలేని నిరుద్యోగ యువతీ యువకుల కోసం రూ.9 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలు అందించడానికి రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించామన్నారు. లక్షల మంది యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించడానికి హైదరాబాద్ నగరంలో ఐటీ సెక్టర్, నాలెడ్జ్ వ్యవస్థలను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.

ప్రపంచంతో పోటీపడే విధంగా ప్రణాళికలు..

హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ప్రజా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణం… అందులో స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి మౌలిక వసతులు కల్పన కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు.

ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి పొందిన సంస్థలను తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరించడంతో పాటు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లి రూ.లక్ష 84 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశం, ప్రపంచంతో పోటీపడే విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్తు మంత్రిమండలి ముందుకెళ్తున్నదని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ శాసన సభ్యులు లక్ష్మారెడ్డి, వైరా శాసన సభ్యులు రాందాస్ నాయక్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, విద్యుత్ ఎనర్జీ సిఎండి సందీప్ కుమార్ సుల్తానీయా, సంబంధిత అధికారులు, అభ్యర్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *