High Court | పేరూరులో ఎన్నికల బహిష్కరణ
- సర్పంచ్ పదవి ఎస్టి మహిళకు రిజర్వ్
- గ్రామంలో ఒకే ఒక్క ఎస్టీ పురుష ఓటరు
High Court | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా అనుముల మండలం పేరూరు గ్రామస్తులు గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల రిజర్వేషన్ల(Electoral reservations)లో భాగంగా పేరూరు గ్రామపంచాయతీ సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు కేటాయించగా, 8 వార్డుల్లో నాలుగు ఎస్టీలకు, నాలుగు జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేదు.
గ్రామంలో ఎక్కువగా బీసీ, ఎస్సీ ఓటర్లు ఉండగా.. వీరికి ఒక్క స్థానం కూడా రిజర్వు కాలేదు. ఉమ్మడి గ్రామపంచాయతీలో ఉన్న వీర్ల గడ్డ తండాకు చెందిన ఒక ఎస్టీ సామాజిక వర్గాని(ST social category)కి చెందిన వ్యక్తి ఓటు ఈ గ్రామంలో నమోదైంది. గ్రామంలో లేని ఎస్టీలకు సర్పంచ్ పదవిని కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు.
ఈ గ్రామంలో రెండో విడతలో 14వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. తమకు జరిగిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు గత నెల 28వ తేదీన రిజర్వేషన్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందోనన్న ఆత్రుతతో గ్రామస్తులు వేచి చూస్తున్నారు. గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించి ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామ కార్యదర్శి జాన్ బాబు తెలిపారు.

