Helmet | నిబంధనలు ఉల్లంఘిస్తే..
Helmet | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా హెల్మెట్(Helmet) ధారణతో పాటు ఇతర రోడ్డు భద్రతా నియమాల పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీసు శాఖ తెలిపింది. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో చిత్తూరు పట్టణంలోని పీసీఆర్ కూడలిలో ట్రాఫిక్ పోలీసుల(traffic police) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాలు అవ్వడం వల్లే ప్రాణనష్టం సంభవిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

హెల్మెట్ ధరించడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని, కుటుంబ భద్రతతో ముడిపడి ఉన్న అంశమని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యంగా వేగ నియంత్రణ(speed control) పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరిస్తే.. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని వివరించారు.
ప్రజల ప్రాణ భద్రత(life safety)ను దృష్టిలో పెట్టుకొని ముందుగా అవగాహన కల్పించే ఉద్దేశంతో రెండు వారాల పాటు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం పూర్తైన అనంతరం కూడా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలందరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలు పాటించి తమ కుటుంబాల భవిష్యత్తు(future)ను సురక్షితంగా కాపాడుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీస్తుందని గుర్తించాలని సూచించారు. హెల్మెట్ ప్రమాదాన్ని పూర్తిగా నివారించకపోయినా, ప్రాణ నష్టం సంభవించే అవకాశాన్ని గణనీయంగా తగ్గించగలదని పేర్కొన్నారు.

